రక్తదానం చేయాలంటే చాలామంది అమ్మో అంటుంటారు. కానీ అనారోగ్యంగా ఉన్న అపరిచితుడికి రక్తమిచ్చి ఆదుకున్నాడు లియో. ఇందులో వింతేముంది అంటారా..? లియో మనిషి కాదు. ఓ శునకం.
మధ్యప్రదేశ్ నరసింహపుర్లోని రౌసరా నివాసి వందనా జాఠవ్ ఆరేళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతి శునకాన్ని పెంచుతున్నారు. పేరు జిమ్మీ. జిమ్మీ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రికి తీసుకెళితే రక్తం ఎక్కించాలన్నారు. స్వజాతి శునకం రక్తం కోసం పలుచోట్ల ఆరాతీసింది వందన. పక్క గ్రామానికి చెందిన రైతు మహేంద్ర ప్రతాప్ సింగ్ వద్ద జర్మన్ షెపర్డ్ జాతి శునకం 'లియో' ఉందని తెలుసుకుని సంప్రదించింది. జిమ్మీకి అవసరమైన రక్తం లియో నుంచి సేకరించేందుకు అనుమతించారు మహేంద్ర.
"మా పెంపుడు శునకం నెలరోజులుగా అనారోగ్యంతో ఉంది. ఆహారం తినడం ఆపేసింది. వైద్యుడ్ని కలిస్తే రక్తం ఎక్కించాలన్నారు. ఓ సోదరుడు అవసరమైన కుక్క రక్తాన్ని అందించి మా జిమ్మీ ప్రాణం రక్షించాడు."
-వందనా జాఠవ్