దిల్లీలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు భాజపా రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్. బేసి సంఖ్యతో రిజిస్టర్ అయిన ఎస్యూవీ వాహానంలో ప్రయాణించిన ఆయనకు రూ.4వేల చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.
కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే ఇలా చేశానని వివరణ ఇచ్చారు గోయల్. సరి-బేసి నిబంధన అమలు చేయడాన్ని.. ఎన్నికల జిమ్మిక్కుగా పేర్కొన్నారు.
గోయల్‌పై విమర్శలు..
దిల్లీ ప్రజల పట్ల విజయ్ గోయల్ బాధ్యతాయుతంగా వ్యహరించట్లేదని విమర్శించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఆయనకు కాలుష్య తీవ్రతపై నిజంగా ఆందోళన ఉంటే.. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సమావేశం ఏర్పాటు చేసి.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సరి-బేసి నిబంధన పాటిస్తుంటే గోయల్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు సిసోడియా.
2016 నుంచి సరి-బేసి
వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీలో 2016 నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ సమయంలో చివరి రెండు అంకెలు సరి సంఖ్య నంబరుపై రిజిస్టర్ అయిన వాహనాలు ఒకరోజు, బేసి నంబరుపై రిజిస్టర్ అయిన వాహనాలు మరో రోజు.. సరి-బేసి తేదీలకు అనుగుణంగా రోడ్లపైకి అనుమతిస్తారు. నిబంధనను అతిక్రమిస్తే రూ.4వేలు జరిమానా విధిస్తారు.