భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తిరిగి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సుదీర్ఘ చర్చలు జరుపుతోంది. బుధవారం సమావేశమైన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ... అభ్యర్థుల జాబితాను పరిశీలించింది. ఏడు దశల్లో నిర్వహించనున్న ఎన్నికల్లో తొలి విడత ఏప్రిల్ 11న జరగనున్నాయి. అయితే.. ఇప్పటివరకు ఎన్నికలకు అధికారికంగా ఏ ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ. ఆయా రాష్ట్రాల వారీగా తమ వద్దకు వచ్చిన జాబితాను పరిశీలించిన కమిటీ కొంత మంది పేర్లనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:"ఇప్పుడు చౌకీదార్ అర్థమేంటో ప్రపంచమంతా తెలిసింది"
కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్‌ను పట్నా సాహిబ్, ఆర్కే సింగ్‌ను ఆరా, గిరిరాజ్ సింగ్‌ను బెగూసరాయ్ స్థానాల నుంచి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది.
ఇతర కేంద్ర మంత్రులు వీకే. సింగ్, సత్యపాల్ సింగ్‌లను పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారి స్థానాల నుంచే పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అధికార ప్రతినిధులు సంబిత్ పాత్రా, ఉపాధ్యక్షుడు వైజయంత్ పాండాలను ఒడిశాలో పోటీకి నిలపాలని నిర్ణయించింది.
వారణాసి నుంచే మోదీ..!
యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిని ఎదుర్కొనేందుకు చాలా మంది సిట్టింగులకు ఈసారి స్థానాలు నిరాకరించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే... మరో స్థానంలో ఎక్కడ నుంచి పోటీ చేసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులతో అభ్యర్థుల ఎంపికపై నరేంద్ర మోదీ, అమిత్ షా సుదీర్ఘ చర్చలు జరిపారు.