బంగాల్లో నవరాత్రుల పూజల్లో ప్రధాని నరేంద్రమోదీ గురువారం పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే 'పూజోర్ శుబికా' కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇందుకోసం బంగాల్లోని భాజపా విభాగం భారీ ఏర్పాట్లు చేసింది.
దుర్గాపూజలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగాల్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"దుర్గా పూజ జరిగే రోజు ఎంతో పవిత్రమైనది. మహాషష్టి వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను భాగం పంచుకోవాలని ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచికి విజయానికి గుర్తుగా ఈ పండగను జరుపుకొంటారు. అందరికీ సంతోషం, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా."
- నరేంద్రమోదీ, ప్రధాని
భారీ ఏర్పాట్లు..
రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్ బూత్‌ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్‌లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బంగాల్ ఎన్నికలు..
బంగాల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా భాజపా అవతరించింది. ఈ సారి ఎలాగైనా సీఎం మమత బెనర్జీ 10 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతామని భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి: 'దసరా స్కెచ్'తో బంగాల్ పీఠంపై భాజపా గురి