భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ రాత్రి 10.50 గంటలకు మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.
సుష్మా స్వరాజ్‌కు భర్త, కుమార్తె ఉన్నారు. ఇటీవలే సుష్మా స్వరాజ్ మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు మాజీ విదేశాంగ మంత్రి.
2014-19 మధ్య విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు సుష్మా స్వరాజ్. 2009-14 మధ్య లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2000-03 మధ్య వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. దిల్లీకి 1998లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ప్రముఖులు సంతాపం...
సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతితో ప్రముఖ రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు.. సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.