మహారాష్ట్రతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హరియాణాలో రాజకీయ దిగ్దంతుల ముందస్తు అంచనాల్ని తప్పాతాలూగా తేల్చేస్తూ ఓటర్లు త్రిశంకు సభను ఆవిష్కరించడం తెలిసిందే. తొంభై స్థానాల అసెంబ్లీలో ‘మిషన్ 75 ప్లస్’ లక్ష్యంతో అవిశ్రాంతంగా శ్రమించిన కమలనాథులు అంతిమంగా సాధారణ మెజారిటీకి ఆరు సీట్లు తరుగుపడటంతో వడివడిగా పావులు కదిపి పది సీట్లు గెలిచిన జన్‌నాయక్ జనతా పార్టీతో పొత్తు ఖరారు చేసి ప్రభుత్వ ఏర్పాటు కానిచ్చేయడం ఇటీవలి ముచ్చటే! ఇచ్చిపుచ్చుకొనే చాకచక్యంతో హరియాణాలో పునరధికారమనే ఉట్టిని అనాయాసంగా కొట్టగలిగిన కమలం పార్టీకి మహారాష్ట్రలో శివసేన మంకుపట్టు గట్టి సవాలు రువ్వుతోంది.
మొన్న మే నెల నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు నోటిమాటగా కుదిరిన ‘పదవీకాలం చెరిసగం’ ఒప్పందాన్ని నేడు లిఖితపూర్వకంగా మన్నించాలని, ముఖ్యమంత్రిగా తొలి రెండున్నరేళ్లు ఆదిత్య ఠాక్రేకు అవకాశం ఇవ్వాలని శివసేన బిగదీసుకుని కూర్చుంది. 25.7 శాతం ఓట్లు, 105 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించిన భాజపా- దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోనే అయిదేళ్ల కూటమి సర్కారు నడుస్తుందని స్పష్టీకరిస్తోంది. ‘సాధారణ మెజారిటీ ఉందనుకుంటే ఫడణవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు’నంటూ తనదారికి కమలం పార్టీ రావాల్సిందేనన్న ధీమా ఒలకబోస్తున్న శివసేన- పవార్ పార్టీ మద్దతు తనకు ఉందన్నట్లుగా వ్యంగ్య చిత్రాలతో సంకీర్ణ రాజకీయాన్ని సంక్షుభితం చేస్తోంది. రేపోమాపో సంకీర్ణ కూటమి సర్కారు ప్రమాణస్వీకారం ఖాయమన్నది కమలనాథుల ధీమా! ఠాక్రేల మొట్టమొదటి రాజకీయ వారసత్వాన్ని ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్ఠించడం ద్వారా శివసేన పార్టీ పునాదుల విస్తరణను లక్షిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే- బెట్టు ఏ మేరకు సడలిస్తారన్నదాన్నిబట్టే ముగుస్తుంది హైడ్రామా!
మహారాష్ట్రలో పులిగాండ్రింపుల రాజకీయం కమలం పార్టీకి కొత్తకాదు. 1995లో మొదటిసారిగా శివసేన, భాజపా కూటమి సాధారణ మెజారిటీకి చేరువై నలభై మంది స్వతంత్రుల దన్నుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొలువుతీర్చినప్పుడే ‘పులిస్వారీ’లోని కష్టనష్టాలు కమలం పార్టీకి అనుభవంలోకి వచ్చాయి. ఆనాడు 169 స్థానాల్లో పోటీచేసిన శివసేన 27.7 శాతం ఓట్లతో 73 సీట్లు సాధించి 60 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అదే కూటమి భాగస్వామిగా భాజపా 116 సీట్లలో పోటీపడి 32 శాతం ఓట్లతో 65 సీట్లు గెలిచి పాతిక స్థానాల్లో ధరావతు కోల్పోయింది. తదాదిగా పోటీ చేసే సీట్ల సంఖ్యాపరంగా భీమభాగం శివసేనదైనా- తెచ్చుకొనే ఓట్లు, గెలుచుకొనే సీట్ల పరంగా ఎప్పుడూ మెరుగైన ఫలితాలే సాధిస్తూ వచ్చిన కమలం పార్టీ, మహారాష్ట్రలో చిన్న తమ్ముడి పాత్రకే పరిమితమవుతూ వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం మహారాష్ట్రనూ ఊపేయడంతో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు 41 భాజపా శివసేన కూటమి గెలుచుకోగా- క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా ఉద్ధవ్ ఠాక్రే గొంతెమ్మ కోర్కెలు కోరబట్టే క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బీటలు వారింది. కీలక రాష్ట్రంలో ఎవరి సొంత బలమెంతో నిగ్గుతేల్చిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో- 31 శాతం ఓట్లతో 122 సీట్లు గెలిచిన భాజపా ఏకైక పెద్దపార్టీగా ఎదిగింది. 19.8 శాతం ఓట్లు 63 సీట్లు గెలుచుకొని 129 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన శివసేన- అవసరార్థం పెద్దరికాన్ని త్యజించి జూనియర్ భాగస్వామిగా నాటి ప్రభుత్వంలో చేరింది. క్రితంసారి క్యాబినెట్లో ఇచ్చిన 12 మంత్రి పదవులకు అదనంగా మరో రెండు, ఉపముఖ్యమంత్రి పదవి, కేంద్రంలో మరో సహాయమంత్రి పదవి ఇవ్వడానికి కమలనాథులు సంసిద్ధత చూపుతున్నా- శివసేన పంతం వీడుతుందా లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది!
ఏకాభిప్రాయానికి, పంచుకొనే విధానానికి భాజపా కూటమి సర్కారు పెద్దపీట వేస్తుందంటూ లోగడ వాజ్‌పేయీ కనబరచిన ఔదార్యం- సంక్షుభిత సంకీర్ణాల సంద్రంలో ఎన్‌డీఏ నావకు సరైన చుక్కానిగా మారింది. అదే రాష్ట్రాల విషయంలో ‘చెరి సగం పదవీ కాలం’ వంటి ఒడంబడికలు కమలం పార్టీకి అచ్చిరాలేదని యూపీలో మాయావతి, కర్ణాటకలో కుమారస్వామి అనుభవాలు చాటుతున్నాయి. 2014లో సీట్ల పంపకాలప్పుడే ముఖ్యమంత్రిత్వం కోసం పట్టుపట్టి కూటమికి చెల్లుకొట్టిన శివసేన- నేడు భాజపాకు తాను తప్పితే గత్యంతరం లేదన్న రాజకీయ సంకట స్థితిని సొమ్ము చేసుకోవాలనుకొంటోంది. పాతికేళ్లపాటు తానే పెద్ద దిక్కుగా ఉండి భాజపాను మహారాష్ట్రలో నడిపిస్తే- 2017 నాటి బృహన్ ముంబయి నగర పాలిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ గణనీయ విజయాలు నమోదు చెయ్యడం, పెద్దపులికి మింగా కక్కాలేని పరిస్థితి సృష్టించింది. క్రితంసారి ప్రభుత్వంలో భాగస్వామి అన్నమాటేగాని ప్రభావశీల మంత్రిత్వశాఖ ఒక్కటీ తనకు దక్కకపోవడం, 22 వేల పైచిలుకు సహకార సంఘాలతో అలరారుతున్న మహారాష్ట్రలో ఆ శాఖ ద్వారా నలు చెరగులకూ పార్టీ విస్తరణ ప్రణాళికలతో ఫడణవీస్ దూసుకెళుతుండటం ఉద్ధవ్ ఠాక్రేకు కలవర కారకమవుతోంది. ముఖ్యమంత్రిత్వంతో పాటు కీలక మంత్రిపదవుల కోసమూ శివసేన గాండ్రించడానికి కారణం అదే. హోం, రెవిన్యూ, పట్టణాభివృద్ధి, సహకారం వంటి శాఖల్ని వదులుకొనేది లేదంటున్న కమలం పార్టీ స్కంధావారాలు పెద్దపులి అలకను ఎలా తీరుస్తాయో చూడాల్సిందే. పరస్పర విశ్వాసం, ఉభయకుశలోపరి వ్యవహారం వంటివి ఏ కూటమి దీర్ఘకాల మనుగడకైనా ప్రాణాధారం. ఒంటెత్తు ధోరణులతో ఏ సంకీర్ణమూ మనజాలదన్నదే చరిత్ర చెప్పే గుణపాఠం!
ఇదీ చూడండి : బాగ్దాదీపై ఉన్న రూ.177 కోట్లు అతనికే!