2019 చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భాజపా కూటమి సన్నహాలు ప్రారంభించింది. 288 స్థానాలున్న శాసనసభలో 220 పైన సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఎన్నికల వ్యూహంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ముంబయి వేదికగా భాజపా నేతలు సమావేశమయ్యారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు ఫడణవీస్. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఫడణవీస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"నూతన ముఖ్యమంత్రిని ప్రజలే నిర్ణయిస్తారు. మనం చేసిన అభివృద్ధే మాట్లాడుతుంది. నేను ఇంతకుముందే శాసనసభలో తిరిగి ఎన్నికవుతానని ప్రకటించాను."
-దేవేంద్ర ఫడణవీస్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కొనసాగుతాయని, త్వరలో సీట్ల అంశమై కూటమి పార్టీలతో చర్చిస్తామని తెలిపారు ఫడణవీస్.
అబ్కీ బార్...నినాదంతో
సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్ ఎన్నికల నినాదాన్ని విడుదల చేశారు. 'అబ్కీ బార్...220 పార్' అని నినదించి 220 సీట్లు గెలవడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. కుంభకోణాలతో కూడిన కాంగ్రెస్ వల్ల దేశానికి తీవ్ర నష్టమని ఆరోపించారు మునుగంటివార్. ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంలో ఒక అధ్యక్షుడు, ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించడం వారి డొల్లతనానికి నిదర్శనమన్నారు.