మహారాజా హరిసింగ్ 125వ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్లో 'జన జాగరణ అభియాన్' ర్యాలీ చేపట్టనుంది భాజపా. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేయాలన్న అలోచనలో భాగంగానే జన జాగరణ అభియాన్ను నిర్వహించనుంది. ఆదివారం జమ్ములో జరగబోయే ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. శ్రీనగర్లో భారీ బహిరంగ సభతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 సమావేశాలు నిర్వహించాలని నేతలు భావిస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగం
జమ్ముకశ్మీర్లో హరిసింగ్ చేసిన అభివృద్ధితో పాటు, అధికరణ 370, 35ఏ రద్దు అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, కశ్మీర్ సంస్కృతి, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై నేతలు ప్రసంగించనున్నట్లు జన జాగరణ అభియాన్ కన్వీనర్ ఠాకూర్ నారాయణ్ సింగ్ తెలిపారు.
" సెప్టెంబర్ 22న జమ్ములోని మహారాజా హరిసింగ్ పార్కులో జరగబోయే ర్యాలీలో జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ప్రసంగిస్తారు. ఆదివారం హరిసింగ్ జన్మదినం సందర్భంగా జన జాగరణ అభియాన్ ర్యాలీని నిర్వహిస్తున్నాం."
- ఠాకూర్ నారాయణ్ సింగ్, జన జాగరణ అభియాన్ కన్వీనర్
ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్తో పాటు భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్లు పాల్గొనే అవకాశముంది.