ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అధికార పక్ష ఎమ్మెల్యేకు విపక్షం మద్దతు పలికింది. వివాదాస్పద ఎమ్మెల్యే నందకిషోర్ గుజ్జర్ రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు దురాగాతాలపై సభలో చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడం వల్ల గుజ్జర్‌కు అనుకూలంగా విపక్ష నేతలు నిరసనకు దిగారు. చివరికి సభ వాయిదా పడింది.
ఇదీ జరిగింది...
ఘజియాబాద్ ఎమ్మెల్యే గుజ్జర్ సన్నిహితులు ఇటీవలే కొందరు అధికారులతో గొడవ పడి అరెస్టయ్యారు. అనంతరం సంబంధిత అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు గుజ్జర్. ఇదే విషయాన్ని నేటి సభలో ప్రస్తావించడానికి ప్రయత్నించారు భాజపా ఎమ్మెల్యే. కానీ స్పీకర్ అందుకు అంగీకరించకపోవడం వల్ల సభలో వాతావరణం వేడెక్కింది. సమాజ్‌వాద్ పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే గుజ్జర్‌కు మద్దతుగా నిలిచారు. సభలో మాట్లాడే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉందని నినాదాలు చేశారు. అయినా స్పీకర్ మాట్లాడటానికి అనుమతినివ్వలేదు. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. గుజ్జర్‌ను సముదాయించేందుకు ఇతర భాజపా ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.