బంగాల్లోని ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లా హెమ్తాబాద్ భాజపా ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బిందాల్ గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఆయన ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ఇది ఆత్మహత్యా..? హత్యా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇది హత్య అని స్థానికులు అంటున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
"ఈ (సోమవారం) ఉదయం హెమ్తాబాద్ ప్రాంతంలోని ఒక దుకాణం సమీపంలో రే అనుమానస్పద స్థితిలో ఉరి తాడుకు వేలాడుతున్నట్లు గుర్తించాం. మేము దర్యాప్తు ప్రారంభించాం." అని పోలీసులు తెలిపారు.
సీపీఎం టికెట్‌పై హెమ్తాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు సదరు ఎమ్మెల్యే. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత గతేడాదే భాజపాలోకి చేరారు.
నడ్డా దిగ్భ్రాంతి..
బంగాల్లో భాజపా ఎమ్మెల్యే మృతి పట్ల భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాల్లో శాంతి భద్రతలపై విమర్శలు గుప్పించారు.
''బంగాల్లో హెమ్తాబాద్ భాజపా ఎమ్మెల్యే అనుమానస్పద స్థితిలో మృతి చెందిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మమతా ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ స్థితిలో ఉన్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రజలు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని క్షమించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.''
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
ఎమ్మెల్యే మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పార్టీ నేత రాహుల్ సిన్హా.