భాజపా, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు....ఎన్నికల బాండ్ల రూపంలో తమకు వచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే 30లోపు విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గుర్తు చేస్తూ గత నెలలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. అయినప్పటికీ భాజపా, కాంగ్రెస్, డీఎంకే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సీల్డ్ కవర్లో...
రహస్య విరాళాల సేకరణను నిషేధించిన సుప్రీంకోర్టు, మే 30లోపు అన్ని పార్టీలు తమకు బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో ఉంచి ఈసీకి సమర్పించాలని ఆదేశించింది.
పారదర్శకత కోసమే...
పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకత కోసమే... ఈ బాండ్లను ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది. ఈ పథకం ప్రకారం, దేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి, దేశీయ సంస్థలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఒకరు వ్యక్తిగతంగా గానీ, కొందరితో కలిసి గానీ ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.