బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్కు పోటాపోటీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పోలింగ్ నిర్వహణపై సమీక్షించేందుకు కోల్కతా వచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా బృందానికి ప్రధాన పార్టీలు వేర్వేరు అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేశాయి.
ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని భాజపా ఆరోపించింది. ఎన్నికలు సజావుగా జరగడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని కోరింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 42 చోట్ల ఘర్షణలు జరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రస్తావించారు.
"వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష కోసం ఎన్నికల కమిషన్ మొత్తం బృందం ఇక్కడికి వచ్చింది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలని వారికి విజ్ఞప్తి చేశాం. అందుకోసం కేంద్ర బలగాలను అతి త్వరలో రాష్ట్రంలో మోహరించాలి. రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీఎంసీకీ అనుకూలంగా ఉంటూ భాజపా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు."
-దిలీప్ ఘోష్, భాజపా బంగాల్ అధ్యక్షుడు
స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన పోలింగ్ కోసం ఓటింగ్ కేంద్రాల లోపల కేంద్ర బలగాలను, వెలుపల రాష్ట్ర పోలీసులను మోహరించాలని దిలీప్ ఘోష్ సూచించారు. రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చూపిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.
టీఎంసీ వాదన ఇలా...