పోక్సో చట్టం సవరణ బిల్లు-2019కి లోక్సభలో ఆమోదం లభించింది. చిన్నారులపై లైంగిక దాడులు, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగంగా ప్రసంగించారు.
"ఈ బిల్లు ఓట్ల కోసం ప్రవేశపెట్టింది కాదు. ఎందుకంటే చిన్నారులు ఓట్లు వేయలేరు. భారత్ భవిష్యత్తును సురక్షిత గమ్యానికి చేర్చేందుకు సంబంధించిన బిల్లు ఇది. శిక్షాస్మృతి చట్టం-2018 సవరణ, ఇప్పుడు చేస్తున్న పోక్సో చట్టం సవరణలతో.. మైనర్లపై దాడికి పాల్పడితే మరణ శిక్ష విధించే అధికారం న్యాయమూర్తులకు ఈ సభ అందిస్తుంది."
-స్మృతి ఇరానీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
చిన్నారుల అశ్లీల సాహిత్యాన్ని ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. లింగబేధం లేకుండా దేశంలోని 43 కోట్ల చిన్నారులకు పోక్సో సవరణ చట్టం రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.