కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం అత్యద్భుతమని కొనియాడారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్. కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న లాక్‌డౌన్ వంటి కార్యక్రమాల వల్లే భారత్‌లో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయని మెచ్చుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి.. బిల్గేట్స్ లేఖ రాసినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనాపై పోరులో మోదీ నాయకత్వం భేష్: బిల్గేట్స్ - corona
కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలు అమోఘమని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ వంటి నిర్ణయాల వల్లే దేశంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని ప్రశంసించారు.
మోదీ చేపట్టిన చర్యల వల్లే భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని తెలిపిన బిల్గేట్స్, దేశవ్యాప్త లాక్‌డౌన్ పాటించడం ఉత్తమచర్య అని ప్రశంసించారు. ఐసోలేషన్లు, క్వారంటైన్, హాట్‌స్పాట్‌ల వంటి చర్యలు, వైద్య విధానం బలోపేతం కోసం తీసుకున్న చర్యలు కూడా బాగున్నాయని కొనియాడారు. భారత్‌లో డిజిటల్ సామర్థ్యాన్ని కూడా పెంచడం హర్షించదగ్గ విషయమని వెల్లడించారు. ఆరోగ్యసేతు యాప్ ద్వారా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమతుల్యతను తీసుకొచ్చేందుకు మోదీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పగా ఉన్నాయన్నారు.