తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెత్తనే ఫీజుగా వసూలు చేస్తున్న పాఠశాల! - padmapani

పిల్లల చదువులు భారమైన రోజులివి. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఆందోళనలు చేపట్టిన ఘటనలు కోకొల్లలు. కానీ, ఓ ప్రైవేటు పాఠశాల మాత్రం ఫీజుకు బదులు చెత్త వసూలు చేస్తోంది. అవును, విద్యార్థులు ఎంత చెత్త తెస్తే అంత ఫీజు వారి ఖాతాలో జమ చేస్తుందీ స్కూలు. పిల్లలకు పాఠాలే కాదు, పర్యావరణాన్ని కాపాడే బాధ్యతా నేర్పుతోంది ఈ బడి.

చెత్తనే ఫీజుగా వసూలు చేస్తున్న పాఠశాల!

By

Published : Jul 16, 2019, 3:54 PM IST

చెత్తనే ఫీజుగా వసూలు చేస్తున్న పాఠశాల!
బిహార్​లోని బోధ్​​గయలోని పద్మపాణి పాఠశాలలో చెత్తనే ఫీజుగా వసూలు చేస్తున్నారు. అందుకే అక్కడ విద్యార్థులు రోజూ బడికొచ్చేటప్పుడు పుస్తకాల సంచితో పాటు చెత్త సంచులూ మోసుకొస్తుంటారు. ఆ చెత్తనంతా ఓ పెద్ద డబ్బాలో నింపుతారు. యాజమాన్యం ఆ చెత్తను రీసైక్లింగ్​(పునరుత్పాదక), పునర్వినియోగ ప్రక్రియకు పంపుతుంది. అలా వచ్చిన ఆదాయాన్ని విద్యార్థుల ఖాతాల్లో ఫీజు కింద జమ చేస్తుంది.

"పిల్లలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన రావాలని కోరుకుంటున్నాం. అందుకే వారిని దారిలోని చెత్తను తీసుకురమ్మని కోరతాం. ఆపై రిసైక్లింగ్​కు పంపిస్తాం." -ఉపాధ్యాయురాలు

లక్షలు చెల్లించినా ఏడాదికోసారి ఫీజు మొత్తాన్ని పెంచుతూనే ఉంటాయి కొన్ని పాఠశాలలు. కానీ ఈ బడిలో... వచ్చే దారిలో కనిపించే చెత్తను సేకరించి బడిలోని చెత్త డబ్బాను నింపడమే విద్యార్థులు చేయాల్సిన పని. అంతే వారింకేం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా స్కూలు యాజమాన్యమే వారికి ఉచిత దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది.

ఇంత మంచి ఆలోచన చేసిన ఈ స్కూలును దక్షిణ కొరియాలోని ఓ సంస్థ నిర్వహిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూ, ఉచిత విద్యను అందిస్తున్నందుకు విద్యార్థులకు బడిపై మక్కువ పెరిగిపోతోంది.

"ఈ స్కూల్​లో ఫీజు భారం ఉండదు. అందుకే మేమిక్కడ చదవాలనుకుంటున్నాం. కేవలం మేము వచ్చే దారిలో చెత్తను తెచ్చి బడిలోని చెత్త బుట్టలో వేస్తాము" -విద్యార్థిని

మనసుంటే ప్రైవేటు బడిలోనూ ఉచిత విద్య అందిచవచ్చని నిరూపించింది పద్మపాణి పాఠశాల.

ఇదీ చూడండి:రోడ్డు పోయింది!.. ఠాణాలో కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details