బిహార్ ఎన్డీఏలో కీలకంగా ఉన్న అధికార పక్షం జేడీయూ.. పొత్తులో భాగంగా తాము పోటీ చేస్తున్న 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జేడీయూ.. ఈ జాబితాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నీతానై ప్రత్యేకంగా ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. ఆర్జేడీ.. ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా సోషల్ ఇంజినీరింగ్ లెక్కలతో అభ్యర్థులను ఎంపిక చేశారు.
వెనుకబడిన వర్గాలే లక్ష్యం
ఈబీసీ ఓటర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. జేడీయూ జాబితాలో చాలా టికెట్లు వీరే దక్కించుకున్నారు. అధికారంలో ఉన్నపుడే వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన నితీశ్.. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ నియామకాల్లోనూ వారికి అగ్రపీఠం వేశారు. ఇవన్నీ సోషల్ ఇంజినీరింగ్.. సామాజిక సర్దుబాటుగానే భావించాలంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఇన్నాళ్లూ లాలూ వెంట ఉన్న ఈ ఓటర్లందరినీ తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలుగా పేర్కొంటున్నారు. జాబితాలో యాదవ్ వర్గానికి స్పష్టమైన ప్రాధాన్యం దక్కింది.
ఆర్జేడీ ఆస్తిపై కన్ను..
ఒక్క యాదవ వర్గానికే.. 19 సీట్లు దక్కాయి. వీరే రాష్ట్రంలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం. ఆర్జేడీ బలమంతా యాదవులే. ఇలా ప్రత్యర్థి కుంభస్థలంపై కొట్టాలనే దిశగా నితీశ్ అడుగులు వేశారు. 2015 ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేసిన కారణంగా.. యాదవుల ఓట్లు జేడీయూకు పడ్డాయి. ఈ నేపథ్యంలో కొంత బలమైన యాదవ నేతలను పార్టీలో చేర్చుకుంది. ఇలా ఓట్లు కొల్లగొట్టాలని జేడీయూ చూస్తోంది.
ముస్లిం ఓట్లు దక్కేనా ?
అలాగే, 11 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది జేడీయూ. ఆర్జేడీ లక్ష్యంగానే ఈ ఎత్తులంటూ అభివర్ణిస్తున్నారు పరిశీలకులు. అంటే, మొత్తం స్థానాల్లో దాదాపు 10% వీరికే కేటాయించారు. ఇప్పటివరకూ ముస్లింలు ఆర్జేడీకే మద్దతు తెలుపుతూ వస్తున్నారు. బిహార్ ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలోనే వీరి సంఖ్య ఉంది. దాదాపు 15% ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎంఐఎం సైతం ఇక్కడి ముస్లింలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, జేడీయూకు వీరు పెద్దగా మద్దతిచ్చిన దాఖలాలు లేవు. ఆర్జేడీ-కాంగ్రెస్‌ల ఓటు బ్యాంకును ఒడిసిపట్టాలనే యోచనలో ఉంది నితీశ్ కుమార్ పార్టీ. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తకుండా చూడటంలో ఆయన విజయం సాధించారనే వాదనలున్నాయి.
ముఖ్యమంత్రి సామాజిక వర్గం..
అయితే, సంఖ్యా పరంగా రాష్ట్రంలో తక్కువగానే ఉన్నారు కుర్మీలు. జేడీయూ వీరికి 12 స్థానాలు కేటాయించటం వెనుక మర్మమేంటో తెలయట్లేదంటున్నారు పరిశీలకులు. ఇది ముఖ్యమంత్రి నితీశ్ సొంత సామాజిక వర్గం. ఓబీసీల్లో బలమైన వర్గంగా ఉన్న కుశ్వాహా సామాజిక వర్గానికి 15 స్థానాలు కేటాయించారు.