తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వైరస్​ నియంత్రణలో బిహార్​ భళా! - coronavirus precautions

దేశంలో కరోనా విషపు కోరలు చాస్తోంది. నలుమూలలా తన ప్రాబల్యాన్ని విస్తరిస్తోంది. అయితే పేద రాష్ట్రాల్లో మొదట వరుసలో, అక్షరాస్యత జాబితాలో చివరిలో ఉండే బిహార్​లో.. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వైరస్​ ప్రభావం చాలా తక్కువ. దీనికి అక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన వేలాది మంది కూలీలను ఎలా సమర్థంగా క్వారంటైన్‌ చేయగలిగింది?

Bihar has taken steps to control the corona
పేరుకు పేద రాష్ట్రం.. కరోనాపై పోరులో బిహార్‌ భళా!

By

Published : Apr 16, 2020, 7:52 PM IST

దేశంలో జనాభా పరంగా మూడో అతిపెద్ద రాష్ట్రం. అక్షరాస్యత పరంగా అట్టడుగు స్థానం. పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేది ఇక్కడి నుంచే. పైగా వైద్య సౌకర్యాలూ అంతంత మాత్రమే. బిహార్‌లోని పరిస్థితి గురించి చెప్పాలంటే ఇంతకంటే ఉపోద్ఘాతం అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది. 10 కోట్ల జనాభా కలిగిన బిహార్‌ ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు కేవలం 74 మాత్రమే. మరణాల సంఖ్య ఒకే ఒక్కటి. దాదాపు 50 శాతం మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలి వారిలో కూడా ఏ ఒక్కరికీ వెంటిలేటర్‌ అవసరం రాలేదు. గురువారం కొత్తగా నమోదైన కేసులు కేవలం 4. ఇంతకీ కేసులు పెరగకుండా బిహార్‌ ప్రభుత్వం ఏం చేయగలిగింది? లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన వేలాది మంది కూలీలను ఎలా సమర్థంగా క్వారంటైన్‌ చేయగలిగింది?

ఏం చేస్తోంది?

ఖతార్‌ నుంచి బిహార్‌కు వచ్చిన ఓ వ్యక్తి మార్చి 22న కరోనా కారణంగా మరణించాడు. బిహార్‌ రాష్ట్రంలో అదే తొలి మరణం. ఇప్పటి వరకు మరో మరణం ఆ రాష్ట్రంలో సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారందరూ కూడా 40 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. దీంతో ఏ ఒక్కరికీ ఇంత వరకు చికిత్సలో వెంటిలేటర్‌ అవసరం రాలేదు. పైగా వైరస్‌ బారిన పడిన వారిని ప్రాథమిక దశలో గుర్తించి వారికి అజిత్రో మైసిన్‌, హైడ్రాక్సీ క్లోరిక్విన్‌, దగ్గుకు సంబంధించిన సిరప్‌లు ఇవ్వడం ద్వారా వారికి నయం చేయగలిగారు వైద్యులు. కొవిడ్‌-19పై పోరు కోసం ప్రత్యేకంగా పట్నాలోని నలంద మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో 800 పడకలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 మంది చికిత్స పొందుతుండగా 14 మంది కోలుకోవడం గమనార్హం. దేశంలో కరోనా మరణాల రేటు 3.40 శాతం కాగా.. బిహార్‌లో అది 1.39 శాతం మాత్రమే. కోలుకున్న బాధితుల విషయంలో 51.39 శాతం రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. కేరళ తొలి స్థానంలో ఉంది.

పేరుకు పేద రాష్ట్రం.. కరోనాపై పోరులో బిహార్‌ భళా!

సమర్థ క్వారంటైన్‌

బిహార్‌ నుంచి ఏటా వలస కూలీలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. రాష్ట్రంలోని 22 జిల్లాలు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే చాలామంది తమ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. అలా వచ్చిన దాదాపు 2 లక్షల మందిని బిహార్‌ యంత్రాంగం స్క్రీనింగ్‌ నిర్వహించి, వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. అందుకోసం స్కూళ్లు, పంచాయతీ భవనాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగించింది. ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ వ్యాపించకుండా దూరంగా ఉంచింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని రాష్ట్ర ప్రజానీకంతో కలవకుండా చర్యలు చేపట్టింది.

కలిసొచ్చిన కోసీ వరదల అనుభవం

బిహార్‌ దుఃఖదాయనిగా కోసీ నదికి పేరుంది. హిమాలయాల్లో పుట్టి నేపాల్‌ నుంచి బిహార్‌లోకి ప్రవేశించే ఈ నది వల్ల ఏటా బిహార్‌లో వరదలు సంభవిస్తుంటాయి. దీంతో ప్రజలు నిరాశ్రయులై ఏటా ఆవాసాలు కోల్పోతుంటారు. అలాంటి వారికి పునరావాసం కల్పించడంలో బిహార్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు విశేష అనుభవం ఉంది. ఇప్పుడు అదే కొవిడ్‌-19పై పోరుకు కలిసొచ్చింది. నెలల తరబడి పునరావాస కేంద్రాలు నిర్వహించిన అనుభవం ఇక్కడ అక్కరకొచ్చింది. కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర సరిహద్దుల్లో 156 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందుకోసం రాత్రీ పగలూ కష్టపడ్డామని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రతాయ అమృత్‌ పేర్కొన్నారు. సీఎం నితీష్‌ కుమార్‌, సీఎస్‌ దీపక్‌ కుమార్‌ నిత్యం అందుబాటులో ఉండేవారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను క్వారంటైన్‌ చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. అంతేకాదు వరదల సమయంలో ఏర్పాటయ్యే కమ్యూనిటీ కిచెన్లు కూడా అన్ని జిల్లాలు, అర్బన్‌ ప్రాంతాల్లో ఎంతో మంది ఆకలిని తీర్చేందుకు వెలిశాయి.

పేరుకు పేద రాష్ట్రం.. కరోనాపై పోరులో బిహార్‌ భళా!

పోరుకు ముందుగానే సన్నద్ధం

కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించకముందే కరోనాపై పోరుకు బిహార్‌ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఒక నెల అదనపు జీతాన్ని అందజేసింది. సుమారు కోటిన్నర మందికి రేషన్‌ కార్డుదారులకు ఉచిత రేషన్‌ సరకులతో పాటు, వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేసింది. అలాగే 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు వెయ్యి చొప్పున, పింఛనుదారులకు మూడు నెలల ముందుగానే పింఛనును చెల్లించింది.

పోలియో తరహా యుద్ధం

1998లో రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నారికీ పోలియో చుక్కలు వేయాలని బిహార్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రైవ్‌ చేపట్టింది. ఇప్పుడు అదే అనుభవంతో మరో యుద్ధానికి బిహార్‌ ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా పల్స్‌ పోలియో తరహాలో నేటి నుంచి (ఏప్రిల్‌ 16) డ్రైవ్‌ ప్రారంభించింది. ఎక్కడైనా ఒక పాజిటివ్‌ కేసు నమోదైతే ఇద్దరు సభ్యులతో కూడిన బృందం 3 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి సర్వే చేపడుతుంది. ఒకవేళ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌ చేస్తుంది. వారికి రక్షణగా భద్రతా బలగాలు కూడా ఉంటాయి. పల్స్‌పోలియో తరహాలో కంటైన్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టిన తొలి రాష్ట్రం బిహారేనని సీఎస్‌ దీపక్‌కుమార్‌ తెలిపారు. ఇందుకోసం దాదాపు 10 వేల బృందాలు ఏర్పాటైనట్లు చెప్పారు. బిహార్‌లో 38 జిల్లాలకు గానూ 24 జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి:కరోనా కలవరం: మహారాష్ట్రలో 3 వేలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details