తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నితీశ్​ 'పంచరత్నాలు'- ఎన్నికల బాధ్యతలన్నీ వీరిపైనే.. - బిహార్ రాజకీయాలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే మరోసారి సీఎం పీఠం అధిరోహించేందుకు సీఎం నితీశ్​ కుమార్​ 'పంచరత్నాల'ను నియమించారు. ముఖ్యమైన సలహాలు, కీలక విషయాలను వీరితోనే పంచుకుంటారు నితీశ్​. వాళ్లెవరో తెలుసుకుందాం.

Bihar elections: Nitish's five jewels to be key faces of JDU
నితీశ్​ 'పంచరత్నాలు'- ఎన్నికల బాధ్యతలన్నీ వీరిపైనే..

By

Published : Oct 1, 2020, 7:34 AM IST

Updated : Oct 1, 2020, 10:21 AM IST

అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతోనే బిహార్​లో రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్​ కుమార్ లక్ష్యంగా ప్రతిపక్షాలు అదేపనిగా విమర్శాస్త్రాలు సంధిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టడంతో పాటు మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు నితీశ్​ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తనకు అత్యంత సన్నిహితులు, నమ్మకస్థులు అయిన ఐదుగురు నేతలకు ఆయన కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రధాన వ్యూహాల అమలు, పార్టీ వ్యవహారాల్లో వీరే కీలకంగా పనిచేస్తారని సమాచారం. పార్టీ వర్గాల్లో 'పంచరత్నాలు'గా పిలుస్తున్న ఆ ఐదుగురు నేతలు ఎవరు? వారి ప్రత్యేకతలేమిటన్నది ఆసక్తికరం.

ఆర్​సీపీ సింగ్​..

ముఖ్యమంత్రి నితీశ్​కు అత్యంత నమ్మకస్థుల్లో ముందుండే నేత ఆర్​సీపీ సింగ్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చాలాకాలంగా పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. నితీశ్​కు అత్యంత సన్నిహితుడైన ఆర్​సీపీ సింగ్ ప్రస్తుతం రాజ్యసభలో పార్టీపక్ష నేత.

లాలన్​ సింగ్...

జేడీయూకు ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్రానికి మంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతం లోక్​సభలో పార్టీపక్ష నేతగా ఉన్నారు. చాలాకాలంగా నితీశ్​-లాలన్​ల మధ్య బలమైన స్నేహం ఉంది. చాలామేర నిర్ణయాలు తీసుకునేటప్పుడు నితీశ్​ ఆయన్ను సంప్రదిస్తుంటారు. భాజపాతో జేడీయూ రెండోసారి జట్టు కట్టడం వెనుక లాలన్​ పాత్ర చాలా కీలకమని చెబుతుంటారు.

విజయ్​ చౌధరీ...

బిహార్​ అసెంబ్లీ స్పీకర్ విజయ్​ చౌధరీపై నితీశ్​ ఎఁతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయన కూడా గతంలో జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో జరిగే కీలక కార్యక్రమాలు, సమావేశాలన్నింటిలోనూ నితీశ్ వెంట ఆయన హాజరవుతుంటారు. సరయ్​రంజన్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్​ మూడోసారి కూడా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

సంజయ్​ ఝా...

ఒకప్పుడు భాజపాలో ఉన్న సంజయ్​, నితీశ్​తో తనకున్న సాన్నిహిత్యంతో తర్వాత జేడీయూలో చేరారు. కేంద్రంలోని చాలా మంది భాజపా నేతలతో సంజయ్​కు సత్సంబంధాలున్నాయి. నితీశ్​ ఆయనతో ముఖ్యమైన సలహా సంప్రదింపులన్నీ చేస్తుంటారు. బిహార్​లోని దర్బాంగాలో ఎయిమ్స్​కు అనుమతి సంపాదించడంలో సంజయ్​ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. దర్బంగా నుంచి గతంలో లోక్​సభకు పోటీచేయాలని భావించినా.. సీట్ల పంపకంలో భాగంగా అది భాజపాకు కేటాయించారు. దీంతో సంజయ్​ను నితీశ్​ శాసనమండలిలోకి తీసుకోవడమే కాకుండా కీలక మంత్రి పదవి కూడా ఇచ్చారు.

అశోక్​ చౌధరీ...

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్​కు నితీశ్​తో చాలాకాలంగా మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తర్వాత తన పరివారంతో ఆయన జేడీయూలో చేరి పోయారు. నితీశ్​కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు. అశోక్​ను ఎంతగానో విశ్వసించే నితీశ్​ ఆయనకు జేడీయూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష పదవితో పాటు, కీలక మంత్రి పదివినీ కట్టబెట్టారు. నితీశ్​ తీసుకునే నిర్ణయాల్లో ఈయన పాత్ర కూడా ఉంటుందని చెబుతారు.

Last Updated : Oct 1, 2020, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details