బిహార్ శాసనసభ తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు.. ముగ్గురు నామపత్రాలు దాఖలు చేశారు. వీరంతా స్వతంత్ర అభ్యర్థులేనని ఈసీ వర్గాలు తెలిపాయి. ఔరంగాబాద్‌లో ఇద్దరు, వజీర్‌గంజ్‌లో ఒకరు నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు అధికారులు.
ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చిన తర్వాత.. నామినేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది.
243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు అక్టోబర్ 28 పోలింగ్ జరగనుంది.
- నామినేషన్లకు చివరితేదీ - అక్టోబర్ 8
- ఉపసంహరణకు గడువు - అక్టోబర్ 12
- పోలింగ్ - అక్టోబర్ 28
ఇటీవల జేడీయూలో చేరిన బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.. తొలి దశ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బక్సర్ జిల్లాలోని ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రెండో, మూడో విడత ఎన్నికల కోసం అక్టోబర్ 9, 13 తేదీల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. వరుసగా నవంబర్ 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.