తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2019, 4:36 PM IST

Updated : Oct 1, 2019, 8:29 AM IST

ETV Bharat / bharat

పౌష్టికాహార లేమితో భోరుమంటున్న బాలభారతం..!

జనాభాలో రెండో అతి పెద్ద దేశం భారత్​..  సరైన తిండికే నోచుకోని వారు చాలా మందే ఉన్నారు. ఆహారం అందక అర్ధంతరంగా తనువు చాలిస్తున్న పిల్లలు ఎక్కువ మందే ఉన్నారు. ఈ మరణాలకు  పౌష్టికాహార లేమి కారణమవుతోందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనంలో తేలింది. దీనిపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉందని ఐసీఎంఆర్​ పేర్కొంది.

భోరుమంటున్న బాలభారతం

తిండి కలిగితే కండ కలదోయ్‌... కండ కలవాడేను మనిషోయ్‌’ అన్న గురజాడ మాటే ప్రాతిపదిక అయితే ఇండియా జన సంఖ్య దాదాపు మూడోవంతు కోసుకుపోతుంది. కండ సంగతి దేవుడెరుగు- సరైన తిండికే నోచనివారు దండిగా పోగుపడిన భారతావని ఉత్పాదక నష్టాలు, రోగాలూ రొష్టుల రూపేణా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. అయిదేళ్లలోపే అర్ధంతరంగా తనువు చాలిస్తున్న పిల్లల్లో ఎకాయెకి 68 శాతం మరణాలకు పౌష్టికాహార లేమి కారణమవుతోందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనం నిర్ధారిస్తోంది.

దేశవ్యాప్తంగా పుట్టే పిల్లల్లో 21శాతం మంది రెండున్నర కిలోల కంటే తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, అదే అత్యధికంగా బాలల మరణాలకు కారణభూతమవుతోందని ఆ నివేదిక చాటుతోంది. 1990-2017 మధ్యకాలంలో రాష్ట్రాలవారీగా సమగ్ర వివరాలు సేకరించి విశ్లేషించి రూపొందించిన నివేదిక అనుసారం- వయసుకు తగ్గ ఎత్తు ఎదగని పిల్లలు 39శాతం మంది. 33 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని, మహిళల్లో 54శాతం, పిల్లల్లో 63శాతం రక్త హీనతతో బాధపడుతున్నారని చాటుతున్న అధ్యయనం- అన్ని వయసుల వారిలో అనారోగ్య సమస్యలకు పౌష్టికాహార లోపమే పుణ్యం కట్టుకొంటోందని స్పష్టీకరించింది.

సరైన తిండీ తిప్పలు లేక అర్ధాకలి అనారోగ్యాలతో బాల్యం గుక్కపెడుతున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ బిహార్‌ అసోం తొలి పంక్తిలో నిలువగా, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, నాగాలాండ్‌, త్రిపుర మలి వరసలో ఉన్నాయి. 1990నాటితో పోలిస్తే 2017నాటికి పౌష్టికాహార లేమి మరణాల శాతం తగ్గిందన్న మాటేగాని, ఇప్పటికీ ఏడు లక్షల మందికిపైగా పిల్లలు ఆ మృత్యుఘాతాలకే బలైపోతున్న తీరు ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, సిక్కిం వంటివి ఆ సమస్యను సమర్థంగా అదుపు చెయ్యగలగడమే ఆశారేఖగా, దేశవ్యాప్తంగా పౌష్టికాహార సంక్షోభ పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి!

పిల్లల సమీకృత అభివృద్ధి సేవల (ఐసీడీఎస్‌) పథకాన్ని ఏనాడో 1975లో బాపూ జయంతినుంచి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం- ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్యకర పుష్టికర ఎదుగుదలను లక్షించింది. దేశంలో ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య దాదాపు పదహారున్నర కోట్లు; అందులో 8.4 కోట్ల మంది ఐసీడీఎస్‌ పరిధిలో ఉండగా, కోటీ 91 లక్షలమంది బాలింతలు చూలింతల బాగోగుల్ని 13.42 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు పర్యవేక్షిస్తున్నాయి. నిరుపేద కుటుంబాల్లో పౌష్టికాహార సమస్యలకు విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ప్రపంచంలోనే అతి పెద్దదిగా ప్రశస్తిగాంచినా దానిపై నీతి ఆయోగ్‌ సాగించిన అధ్యయనం 2015 జూన్‌లో ఎన్నో లోటుపాట్లను వేలెత్తి చూపింది.

వెనకబాటుతనానికి మారుపేరుగా దుష్కీర్తి మూటగట్టుకొన్న ‘బిమారు’ (బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌) రాష్ట్రాలు సకల బాలారిష్టాలకూ కేంద్ర బిందువులని తాజా అధ్యయనమూ నిగ్గుతేల్చింది. సరైన పోషకాలందక బాల్యం బక్కచిక్కి పోతే, పిల్లలు ఎదిగిన కొద్దీ వారి శారీరక మానసిక వికాసం మందగిస్తుందని, తరచూ అనారోగ్యాలకు గురయ్యే ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుందంటున్న వైద్యులు ఒక దశలో అలాంటి వాళ్లు జీవచ్ఛవాలై మిగిలి పొగిలే దురవస్థనూ ప్రస్తావిస్తున్నారు. పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని మట్టుబెడతామన్న తొలితరం నేతల వాగ్దానాలు నెరవేరి ఉన్నా, అంగన్‌వాడీ, ఐసీడీఎస్‌ ప్రయోగాలు సఫలమైనా- జాతి నెత్తిన ఈ ఉపద్రవం ఉరిమేదే కాదు.

హర్‌ ఘర్‌- పోషణ్‌ త్యోహార్‌ (ప్రతి ఇంటా పోషకాల పండుగ) అంటూ సెప్టెంబరు నెలను పోషకాహార మాసోత్సవంగా మోదీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2022నాటికి పౌష్టికాహార లోపాల్ని సమూలంగా తుడిచి పెట్టేందుకంటూ ‘పోషణ్‌ అభియాన్‌’ను ప్రభుత్వం పట్టాలకెక్కించినా- బండి నడక ఇదే తీరుగా ఉంటే నిర్ణీత గడువులో గమ్యం చేరిక అసాధ్యమని పలు విశ్లేషణలు ఎలుగెత్తుతున్నాయి!
పౌరులంతా శక్తియుతులు, యుక్తిపరులుగా ఎదిగి సమర్థ మానవ వనరులుగా అక్కరకొచ్చినప్పుడే ఏ జాతి స్థిర ప్రగతికైనా భరోసా ఉంటుంది. ప్రపంచ మానవ మూలధన సూచీలో ఇండియా 158వ స్థానంలో కునారిల్లడం, సగంమందికిపైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న నేపథ్యంలో భావితరాల ఆరోగ్యం మీద దాని దుష్ప్రభావం తీవ్రంగా ప్రసరించనుండటం- ఆందోళన కలిగిస్తోంది. అయిదేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపం దేశానికి రెండు లక్షల 70వేల కోట్ల రూపాయల రాబడి నష్టంగా పరిణమిస్తుందని 2016నాటి అంచనాలు నిర్ధారిస్తున్నాయి.

2017నాటి జాతీయ పౌష్టికాహార వ్యూహం ప్రకారం- మూడేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు పెరుగుదల లోపాన్ని 2022నాటికి ఏడాదికి మూడుశాతం వంతున తగ్గిస్తూ పోవాలని, పిల్లలు, కౌమార ప్రాయంలోనివారు, మహిళల్లో రక్తహీనతను మూడోవంతు పరిహరించాలని ప్రభుత్వం లక్షించింది. 2008-’16 మధ్యకాలంలో ప్రభుత్వం సాధించగలిగింది ఏటా ఒక్కశాతం ఫలితమే అని రుజువైనందున సర్కారీ వ్యూహంలో గుణాత్మక మార్పులు ప్రస్ఫుటం కావాలి. విటమిన్‌ ఏ లోపం ఇన్‌ఫెక్షన్ల బెడద పెంచి తట్టు, విరోచనాల వంటి వ్యాధులకు కారణమవుతుందని తెలిసినా, 40శాతం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, విటమిన్ల దన్ను అందుబాటులో లేవు.

సౌష్టవ భారత్‌ (ఫిట్‌ ఇండియా) అంటూ నినదిస్తున్న ప్రధాని మోదీ- కర్కశ పేదరికమనే సుడిగాలికి బాలల ప్రాణ దీపాలే కాదు, దేశ భవిష్యత్తూ కొడిగట్టిపోతున్న ప్రస్తుత దురవస్థను విస్మరించలేరు. సుస్థిర మానవాభివృద్ధి లక్ష్యాల సాధన సమయానికైనా (2030) జాతి నిస్త్రాణను వదిలించి ఆరోగ్యకర బాల భారతం పాదుకొనేలా యుద్ధ ప్రాతిపదికన కదలాలిప్పుడు!

ఇదీ చూడండి:లైంగిక వేధింపుల ఆరోపణలతో చిన్మయానంద్​ అరెస్టు

Last Updated : Oct 1, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details