తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటికీ వెంటాడుతున్న భోపాల్ పాపాల్​ - భోపాల్ గ్యాస్ ప్రమాదం

ఇప్పటికే కరోనా కారణంగా సతమతమవుతున్న యావత్​ దేశం.. విశాఖ గ్యాస్​ లీక్ దుర్ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్యాస్​ లీకేజీ లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అందిరికీ భోపాల్​ దుర్ఘటనే గుర్తుకొస్తుంది. ఈ వందేళ్లలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ఐరాస గత ఏడాది పేర్కొంది. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న ఆ దుర్ఘటనకు కారకులెవరు? అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?

BHOPAL GAS LEAK TRAGEDY
భోపాల్ దుర్ఘటనలో బాధితలకు ఇంకా జరగని న్యాయం

By

Published : May 8, 2020, 7:38 AM IST

భోపాల్‌ విషవాయువు లీకేజీ దుర్ఘటన ఈ శతాబ్దంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం. 1984 డిసెంబర్‌ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్‌ నగరంలో జనం గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా విషవాయువు చుట్టేసింది. ఊపిరాడని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగుతీశారు. మృత్యువుతో జరిగిన ఈ పరుగు పందెంలో చాలా మంది ఓడిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలే. నోటివెంట నురగలు కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. మూగజీవాల మరణాలకు లెక్కేలేదు. తెల్లారేసరికి భోపాల్‌ మరుభూమిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన న్యాయపోరాటం ఇంతకు మించిన విషాదంగా పరిణమించింది. దశాబ్దాలు గడిచిపోతున్నా బాధితులకు న్యాయం జరగలేదు.

ముందే హెచ్చరికలు ఉన్నా..

పురుగు మందులను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన యూనియన్‌ కార్బైడ్‌ కార్పొరేషన్‌ 1969లో భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో మీథైల్‌ ఐసోసైనైడ్‌(ఎంఐసీ)ను ఉపయోగిస్తారు. 1979లో ఇక్కడే ఎంఐసీని తయారు చేసేందుకు వీలుగా ప్లాంట్‌ నిర్మించారు. 1980లో పురుగు మందులకు డిమాండ్‌ తగ్గింది.. కానీ, ఇక్కడ ఉత్పత్తి మాత్రం కొనసాగింది. దీంతో ఉపయోగించని ఎంఐసీ నిల్వలను అక్కడే భద్రపరిచే ఏర్పాట్లు చేశారు.

అణు విస్ఫోటంలా 'ఈ610' ట్యాంక్‌

ఈ కర్మాగారంలో తయారైన ఎంఐసీని మూడు ట్యాంకుల్లో నిల్వచేసేవారు. వీటిల్లో 50 శాతం లేదా 30 టన్నులకు మించి ఎంఐసీని ఉంచకూడదని నిబంధనలు చెబుతుంటే దీనికి విరుద్ధంగా 'ఈ610' ట్యాంక్‌లో 42 టన్నుల వరకు కుక్కారు. 1984 డిసెంబర్‌2వ తేదీ మధ్యాహ్నం ఒక పైపులో జరిగిన లీకేజీ కారణంగా ఈ ట్యాంక్‌లోకి నీరు చేరింది. అది ఎంఐసీతో రసాయన చర్య జరపడంతో రాత్రి వేళకు ఆ ట్యాంక్‌లో ఒత్తిడి ఐదు రెట్లు పెరిగిపోయింది. అర్ధరాత్రి సమయానికి కార్మికులు ఎంఐసీ లీకేజీ అవుతున్నట్లు గుర్తించారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. దాదాపు 60 నిమిషాల్లో 30 టన్నుల మీథైల్‌ ఐసోసైనైడ్‌ గాల్లో కలిసి నగరం వైపుగా వెళ్లిపోయింది.

ఎక్కడ చూసినా శవాలే..

నాడు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భోపాల్‌ మొత్తాన్ని ఈ విషవాయువు చుట్టేసింది. ఇక్కడ మొత్తం 56 వార్డులకు గాను 36 వార్డుల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వీధుల్లోకి వచ్చి వాంతులు చేసుకొంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ గ్యాస్‌ బరువు ఎక్కువగా ఉంటుంది. దీంతో గాల్లో కలిసిన విషవాయువు ఉదయం అయ్యేసరికి నేలపైకి చేరడం మొదలైనప్పుడు మరింత మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో 2,259 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆరోగ్య సమస్యలతో మరణించిన వారిని కూడా కలుపుకొంటే ఈ అంకె 15వేలను దాటేస్తుంది. మరికొన్ని సంస్థలు ఈ సంఖ్య 20 వేలను దాటిందని చెబుతున్నాయి. వీరి అంతిమ సంస్కారాలకు శ్మశానాలు చాల్లేదంటే నాటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం 6 లక్షల మంది ప్రజలు ఈ విషవాయువు ప్రభావానికి గురయ్యారు. నేత్ర, ఉదర, శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారు. కొన్నేళ్ల పాటు అక్కడ గర్భస్రావాలు, శిశుమరణాల రేటు 200 నుంచి 300 శాతం వరకు పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వీధులు మూగజీవాల కళేబరాలతో నిండిపోయాయి. ఈ ప్రమాదం జరిగాక కూడా లీకైన వాయువు ఏమిటనే విషయాన్ని యూసీఐఎల్‌ వెంటనే బయటకు చెప్పలేదనే విమర్శలు ఎదుర్కొంది.

దశాబ్దాలుగా న్యాయపోరాటం..

ఈ ఘటన తర్వాత 1985 మార్చిలో 'భోపాల్‌ గ్యాస్‌ లీక్‌' చట్టాన్ని తీసుకొచ్చి భాధితుల తరపున ప్రభుత్వం అమెరికాలో న్యాయపోరాటం చేపట్టింది. ఈ కేసును భారత కోర్టుకు బదిలీ చేస్తూ అమెరికా న్యాయస్థానం నిర్ణయం తీసుకొంది. తొలుత యూసీఐఎల్‌ మాతృ సంస్థ యూసీసీ 50 లక్షల డాలర్ల పరిహారాన్ని ఇస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం 330 కోట్ల డాలర్లను డిమాండ్‌ చేసింది. 1989లో 4.7 కోట్ల డాలర్లు (నాటి విలువ రూ.715 కోట్లు) చెల్లించేదుకు అంగీకరిస్తూ యూసీఐఎల్‌ ప్రభుత్వంతో రాజీ చేసుకుంది.

  • 1992లో కంపెనీ సీఈవో అండర్సన్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా కోర్టు ప్రకటించింది.
  • 2001 డోకెమికల్స్‌లో అనే సంస్థలో యూనియన్‌ కార్బైడ్‌ కార్పొరేషన్‌ విలీనమైంది. ఆ తర్వాత భోపాల్‌ దుర్ఘటన బాధ్యత తీసుకోవడానికి ఈ కొత్త సంస్థ నిరాకరించింది.
  • 2010లో ఈ కేసులో కోర్టు ఏడుగురిని దోషులుగా తేల్చింది. కానీ, వారు ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
  • 2010లో పరిహారాన్ని రూ.7,727 కోట్లకు పెంచాలని ప్రభుత్వం క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది పెండింగ్‌లో ఉంది.
  • 2014 సెప్టెంబర్‌లో వారెన్‌ అండర్సన్‌ మృతి చెందారు.
  • విషపూరిత వ్యర్థాలను తొలగించే అంశం కూడా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. 11 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు అక్కడే ఉన్నాయి.
  • గతేడాది భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను ఐరాస ఈ వందేళ్లలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా పేర్కొంది.

ఇదీ చూడండి:భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో...

ABOUT THE AUTHOR

...view details