ఇంటి అవసరాల కోసం మనం చాలా నీటిని ఉపయోగిస్తాం. ఈ నీళ్లు భూగర్భం నుంచి, జలాశయాల నుంచి వస్తుంటాయి. అయితే పూర్తిగా మన ఇంటిపైనే పడే వర్షపు నీటితో మాత్రమే ఇంటి పనుల చేసుకుంటే ఎలా ఉంటుంది? దీనితో పాటు భూగర్భ జలం స్థాయి పెంచితే బాగుంటుంది కదా? వినటానికి ఆసక్తిగా ఉన్న ఈ ఆలోచనను బెంగళూరులోని ఓ వ్యక్తి ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన విశ్వనాథ్... వర్షపు నీరు బొట్టుబొట్టునూ ఒడిసిపడతారు. వివిధ ట్యాంకులలో నింపుతారు. తాగటానికి, వంటకు వీటిని మాత్రమే ఉపయోగిస్తారు. స్నానం లాంటి పనులు నుంచి వచ్చిన నీళ్లను రీసైక్లింగ్ చేసి పైకప్పు, ఇంటి ప్రాంగణంలో పెంచుతున్న కూరగాయల మొక్కలకు వాడుతుంటారు. ఇలా సంవత్సరంలో 300 నుంచి 320 రోజులు చేస్తానని ఆయన చెబుతున్నారు.