'మన దగ్గర ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయాలి' అనే మాటను ఇద్దరు యాచకులు ఆచరించి అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనాతో దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో తిండి దొరకని నిరుపేదల ఆకలి తీర్చేందుకు తమ వంతుగా బియ్యం, పప్పులు దానం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రత్నం, నేపాల్‌కు చెందిన నేపాలి బాబా అనే ఇద్దరు వ్యక్తులు 25 ఏళ్ల నుంచి హిమాచల్‌ప్రదేశ్ కులులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇరువురు మంచి స్నేహితులు కూడా. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి చలించిపోయారు. ఆకలి విలువ తెలిసిన వారు కనుకే తమ వద్ద ఉన్నదానిలో నుంచి కొంత దానం చేసేందుకు ముందుకు వచ్చారు. నిరుపేదల ఆకలి తీరుస్తోన్న అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకుని.. 50కిలోల గోధుమపిండి, 50 కిలోల బియ్యం, 10కిలోల పప్పులు విరాళంగా అందించారు.