ఆంక్షలు సడలిస్తున్నా ఏడారిని తలపిస్తున్న కశ్మీర్ జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. శ్రీనగర్ లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు అధికారులు. జనసంచారానికి అనుమతులు రావటం వల్ల ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం పెరిగింది. శ్రీనగర్‌లోని సివిల్ లైన్స్‌లో పరిస్థితి మెరుగుపడింది.
"సెక్షన్ 144 రద్దు చేశాక రాష్ట్రంలో పరిస్థితులు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే పూర్తి స్థాయిలో విజయవంతం కావట్లేదు. ఎందుకంటే సోమవారమే పాఠశాలలను తిరిగి ప్రారంభించినా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సంతోషించాల్సిన విషయమేమిటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నేతలెవరూ బయటలేరు. సుమారు 300కు పైగా నేతలను ప్రభుత్వం నిర్బంధించింది. కశ్మీర్ ప్రజల్లో కోపం తగ్గడానికి ఇదే ముఖ్య కారణం."
- అమిత్‌కుమార్, శ్రీనగర్ వాసి
కొన్ని ప్రాంతాల్లో మాత్రం...
ఆంక్షలు ఎత్తేసినా భద్రతా బలగాలను మాత్రం తొలగించలేదు ప్రభుత్వం. శ్రీనగర్‌లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. 16 రోజులుగా ప్రజా రవాణా, దుకాణాలు, అంతర్జాల సేవల పరిస్థితి మాత్రం మారలేదు. ఆత్మీయులతో మాట్లాడుకోవటానికి అక్కడక్కడ ల్యాండ్‌లైన్ ఫోన్లు ఏర్పాటు చేశారు.
కొన్ని ఘర్షణలు జరిగినట్లు వార్తలు వస్తున్నా లోయ శాంతియుతంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మందుల కొరత
జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ కారణంగా నిత్యావసర వస్తువులపై ప్రభావం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆంక్షల వల్ల శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సౌకర్యాన్ని మూసివేయటమే ఇందుకు కారణం. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికీ ఔషధాలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: పాక్ దురాగతానికి మరో భారత జవాన్ బలి