ఆరు నెలల్లోగా బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ పూర్తి చేయాలని ప్రత్యేక న్యాయమూర్తికి స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ పూర్తి చేసి 9నెలల్లోపు తీర్పు వెల్లడించాలని ప్రత్యేక న్యాయమూర్తికి సూచించింది.
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే యాదవ్ పదవీకాలం 2019 సెప్టెంబరు 30న ముగియనుంది. దీనిని పొడిగించాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయంపై నాలుగు వారాల్లో ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేవలం బాబ్రీ కేసు విచారణ నిమిత్తమే జస్టిస్ యాదవ్ పదవీకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది సుప్రీం. ఈ కేసు విచారణ పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని సోమవారం సుప్రీంను ఆశ్రయించారు జస్టిస్ యాదవ్.