ఆజాం ఎంబ.. ఓరాన్ తెగకు చెందిన కురుఖ్ భాషలో ఈ పదానికి కమ్మటి భోజనం అని అర్థం. ఈ పేరుతో ఝార్ఖండ్ రాంచీలో ఉన్న ఓ స్లో ఫుడ్ రెస్టారెంట్.. అందుకు తగ్గట్టే ఆదివాసీల పద్ధతుల్లో సంప్రదాయంగా తయారుచేసిన భోజనం అందిస్తోంది.
"నేను ఓరాన్ తెగకు చెందినవాడిని. మా భాష కురుఖ్‌లోని ఓ పదాన్నే నా రెస్టారెంటుకు పేరుగా పెట్టుకున్నాను. అదే అజాం ఎంబా. అంటే కమ్మని ఆహారం అని అర్థం. ఝార్ఖండ్ సంప్రదాయ ఆహారం అందగా ఆదరణ పొందలేదు. దాన్ని నేను పొలం నుంచి పళ్లెంలోకి తెచ్చాను."
-అరుణ తిర్కే, అజాం ఎంబా డైరెక్టర్
అజాం ఎంబాకు వచ్చే వినియోగదారులకు దొరికే సాదర ఆహ్వానం.. మనసుల్లో ఉత్తేజం నింపుతుంది. తెగ సంప్రదాయం ప్రకారం.. ఓ చెంబుతో చేతులు కడుక్కుంటారు. తర్వాత ఇంట్లోలాగే ఓ చాపపై కూర్చోబెట్టి, భోజనం వడ్డిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే.. బియ్యాన్ని స్వయంగా వీళ్లే దంచుతారు. మసాలాలు రోటిలో నూరుతారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు. ఇక్కడి భోజనం రుచిచూడాలంటే కొద్దిసేపు ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ, మట్టిపాత్రలు, రాగి చెంబులు, సంప్రదాయ భోజనం రుచి... ఎంతసేపైనా ఎదురుచూసేలా చేస్తుందనడం అతిశయోక్తి కాదు.
"దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. రెస్టారెంట్ పేరు నుంచి, వెయిటర్స్ వేసుకునే దుస్తుల వరకు అన్నీ విభిన్నమే. ఆదివాసీల సంప్రదాయాలను బతికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది."
-సోనీ కుమారి, కస్టమర్
"ఇక్కడికొచ్చినప్పుడల్లా ఓ అతిథిలా చూస్తారు. మా సంప్రదాయం ప్రకారం చెంబుతో చేతులు కడుక్కొమ్మంటారు. దోనా-పత్రిలో భోజనం వడ్డిస్తారు. ఆహారం చాలా బాగుంటుంది."
-నీరజ్ కుమార్, వినియోగదారుడు