ఆరోగ్య సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆయుష్మాన్ భారత్' పథకంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్‌లో కొన్ని ఆరోగ్య సమస్యలకే చికిత్స లభిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకొచ్చే ఆరోగ్య సంరక్షణ పథకం అలాంటిది కాదని రాహుల్ వెల్లడించారు.
చత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరోగ్య సంరక్షణ, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామని, ఆరోగ్య సంరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జీడీపీలో 3 శాతం నిధులను ఆరోగ్య సంరక్షణపై ఖర్చు చేస్తామని తెలిపారు.
"కొద్ది మంది మాత్రమే పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టుకునేందుకు పనికొచ్చే పథకాలను మేం నడవనివ్వం. ఆయుష్మాన్ భారత్ పథకం అలాంటిదే. ఇది కేవలం కొన్ని ఆరోగ్య సమస్యలకే పరిమితమైంది. దేశంలోని 15-20 మంది సంపన్న వ్యాపారవేత్తలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉంది. మేం అమలు చేయబోయే పథకం అలాంటిది కాదు." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
భారత్ గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణ వ్యవస్థకు భారీ స్థాయిలో మారుతోందని, ఇది బాధాకరంమైన విషయమైని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్యపై నిధులను పెంచనుందని తెలిపారు.