తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య వివాదాస్పద భూమి మొత్తం మాదే' - వివాదం

అయోధ్యలోని వివాదాస్పద భూమి మొత్తం తమకే చెందుతుందని హిందూ సంస్థ నిర్మోహి అఖాడా స్పష్టం చేసింది. వందల ఏళ్లుగా సంబరాలు నిర్వహిస్తున్నామనీ, మాకు అన్ని హక్కులుంటాయని సుప్రీంకోర్టులో వాదించింది.

అయోధ్య కేసు

By

Published : Aug 6, 2019, 12:18 PM IST

Updated : Aug 6, 2019, 3:24 PM IST

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంగణంలోకి 1934 నుంచి ముస్లింల ప్రవేశానికి అనుమతి లేదని హిందూ సంస్థ నిర్మోహి అఖాడా ఉద్ఘాటించింది. సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో భాగంగా నిర్మోహి అఖాడా తరఫు న్యాయవాది సుశీల్​ జైన్​ వాదనలు వినిపించారు.

"మాది గుర్తింపు పొందిన సంస్థ. మేం వాదించేది ఊరేగింపు, ఆలయ నిర్వహణ హక్కుల గురించి మాత్రమే. వందల ఏళ్లుగా ఊరేగింపు నిర్వహిస్తున్నాం. రామ జన్మస్థలం లోపలి ప్రాంగణం నిర్మోహి అఖాడా అధీనంలోనే ఉండేది. లోపలి ప్రాంగణంలోకి హిందువులు వచ్చి పూజలు చేసేవారు. 1934 తర్వాత ముస్లింలకు లోపలికి అనుమతి ఉండేది కాదు. అలహాబాద్​ తీర్పు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వివాదం ఉన్న స్థలమంతా నిర్మోహి అఖాడా సంస్థదే."

-సుశీల్​ జైన్, నిర్మోహి అఖాడా తరఫు న్యాయవాది

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం విఫలమయిందని ప్రకటించిన సుప్రీంకోర్టు... నేటి నుంచి రోజువారీ విచారణ చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేసును పరిశీలిస్తోంది.

ధావన్​పై సీజేఐ ఆగ్రహం

సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్​ బాబ్దే, జస్టిస్ చంద్రచూడ్​, జస్టిస్ అశోక్​ భూషణ్, జస్టిస్​ నజీర్​ కూడా ధర్మాసనంలో భాగమయ్యారు. వాదనల్లో భాగంగా ధర్మాసనంతో ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్​ ధావన్​కు​ వాగ్వివాదం నడిచింది.

అఖాడా సంస్థను ధర్మాసనం ప్రశ్నిస్తున్న సమయంలో ధావన్​ జోక్యం చేసుకున్నారు. ఎంత చెప్పినా వినకపోయేసరికి సీజేఐ ఆగ్రహించారు. "మీరు కోర్టు కార్యాలయంలో ఉన్నారు.. కోర్టు గౌరవాన్ని కాపాడాలి"అని సూచించారు.

అలహాబాద్ కోర్టు తీర్పు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: ఆర్టికల్​ 370 సమస్యకు పరిష్కారం 370నే

Last Updated : Aug 6, 2019, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details