అయోధ్య వివాదం సుదీర్ఘకాలంగా నలుగుతోంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంతం తమదంటే తమదంటూ హిందూ- ముస్లింలు కలహించుకుంటున్నారు. దీనిపై ఎన్నెన్నో కోర్టు కేసులు, మరెన్నో వివాదాలు. ఈ వ్యవహారంపై 2010 సెప్టెంబరు 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పు అత్యంత కీలకమైనది.
2010లో ఏ జడ్జి తీర్పు ఏమిటి?
వివాదాస్పద స్థలం రాముడి జన్మస్థానమే. దాన్ని బాబర్ ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్మించారు. ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలే లేవు
- జస్టిస్ డి.వి.శర్మ
హిందువుల విశ్వాసం ప్రకారం అది రామ జన్మస్థలమే. ఇక్కడ మసీదును ఎవరు, ఎప్పుడు నిర్మించారో రుజువు కాలేదు. ముస్లింలు చిరకాలంగా దీన్ని మసీదుగానే భావిస్తూ వచ్చారు
- జస్టిస్ సుధీర్ అగర్వాల్
మసీదు నిర్మాణం కోసం ఏ గుడినీ కూలగొట్టలేదు. చాలాకాలంగా పడిఉన్న ఆలయ శిథిలాల మీద మసీదును నిర్మించారు
- జస్టిస్ ఎస్.యు.ఖాన్
కీలక తీర్పు..
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద ప్రాంగణాన్ని మూడు సమ భాగాలుగా విభజించి.. హిందూ, ముస్లింలకు అప్పగించాలని అప్పట్లో అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదును కూల్చి రామ్‌లల్లా విగ్రహాలు నెలకొల్పిన తాత్కాలిక మందిర ప్రదేశాన్ని మాత్రం శ్రీరాముడి జన్మస్థలంగానే పరిగణిస్తూ.. దానిని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు అప్పగించాలంది. రామ్ ఛబుత్ర, సీతారసోయిని నిర్మొహి అఖాడాకు ఇవ్వాలని, మిగతా భాగాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వొచ్చునంది. వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరికీ చెందవని, అందుకు నిర్దిష్ట సాక్ష్యాధారాలేమీ లేవని, అది 3 పక్షాల ఉమ్మడి ప్రాంగణమంది. అందువల్ల ముగ్గురికీ ఉమ్మడి హక్కులు కల్పిస్తున్నామని కోర్టు స్పష్టీకరించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై యాజమాన్య హక్కు కోసం నిర్మొహి అఖాడా, రామ్‌లల్లా తరఫున హిందువులు, సున్నీవక్ఫ్ బోర్డు దాఖలుచేసిన పిటిషన్లపై జస్టిస్ డి.వి.శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ఎస్.యు.ఖాన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం 2-1 తేడాతో 8189 పేజీల మెజారిటీ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ పిటిషన్లపైనే సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు...
- అయోధ్యలోని 2.77 ఎకరాల భూమి తమకే చెందుతుందని వక్ఫ్‌బోర్డు వేసిన వ్యాజ్యాన్ని, రామ్‌లల్లా తరఫున దాఖలైన మరో కేసును హైకోర్టు కొట్టేసింది. భూభాగంపై ముగ్గురు కక్షిదారులూ ఉమ్మడిగా హక్కు కలిగి ఉన్నారని స్పష్టంచేసింది.
- మసీదు బయట ఉన్న ఆవరణ హిందూ, ముస్లింలకు సమానంగా చెందుతుందంది. అప్పీలుకు మూడు నెలల గడువిచ్చింది.
కీలక ప్రశ్నలు... ఆధారాలతో హైకోర్టు జవాబులు
మొత్తం వివాదాన్ని ఆమూలాగ్రం తరచి చూసిన హైకోర్టు దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలను, సందేహాలను రూపొందించి.. వాటికి సమాధానాలను అన్వేషించింది. ఆ ప్రశ్నలేమిటో.... వాటికి తుది తీర్పులో న్యాయమూర్తులిచ్చిన జవాబులేమిటో చూద్దాం...
1885లో వేసిన వ్యాజ్యం హక్కుదారులను నిర్ణయిస్తుందా?
రామ్‌ఛబుత్ర ప్రాంతంలో మందిర నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతూ 1885లో మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దానిని బాబ్రీ మసీదు ముతావలీ మహ్మద్ అస్గర్ వ్యతిరేకించారు. విచారణ తర్వాత రఘువర్‌దాస్ వ్యాజ్యాన్ని జిల్లా కోర్టు కొట్టివేసింది. మందిర నిర్మాణానికి అనుమతిస్తే మత ఘర్షణలకు బీజం వేసినట్లు అవుతుందని నాటి తీర్పులో కోర్టు అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని అలహాబాద్ హైకోర్టు గుర్తుచేసింది.
1989లో హిందువులు, ముఖ్యంగా రామ్‌లల్లా విరాజ్‌మాన్ చేసిన వాదనకు కాలదోషం పట్టిందా?
కక్షిదారులు ఆరేళ్లలోగా క్లెయిం దాఖలు చేయకపోతే వారికి ఆస్తిపై హక్కు ఉండదని చట్టం చెబుతున్నా, రామ్‌లల్లా తరఫున దాఖలైన వ్యాజ్యానికి అది ప్రతిబంధకం కాదు. నిర్మొహి అఖాడా, సున్నీ వక్ఫ్‌బోర్డు దాఖలు చేసిన వ్యాజ్యాలకు కాలదోషం పట్టినట్లేనని హైకోర్టు స్పష్టీకరించింది.
కట్టడాన్ని ఎప్పుడు, ఎవరు నిర్మించారు? ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది?
హిందూ, ముస్లింల ఇద్దరి వాదనల్లోనూ నిర్ధారిత సాక్ష్యాలు లేవంటూ జస్టిస్ యు.ఎస్.ఖాన్, జస్టిస్ అగర్వాల్‌లు అభిప్రాయపడ్డారు. ఐరోపా భూభౌతిక శాస్త్రవేత్త జోసఫ్ టైపెంథ్లార్ 1786లో అవధ్‌లో పర్యటించడానికి ముందే కట్టడాన్ని నిర్మించారని, 1528లోనే నిర్మించినట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు లభించలేదని జస్టిస్ ఖాన్ తెలిపారు. మసీదును బాబర్ ఆదేశంతో మీర్‌బాఖి నిర్మించారని అయితే... అది 1528లో జరిగినట్లు నిర్ధారణకు రాలేమంటూ జస్టిస్ శర్మ స్పష్టంచేశారు.
పురాతన హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించారా?
జస్టిస్ ఖాన్: మసీదును నిర్మించడానికి ఎలాంటి ఆలయాన్ని కూల్చేయలేదు. కానీ... పురాతన గుడి శిథిలాలపైనే దాన్ని కట్టారు. కొన్ని శిథిలాలను సైతం కట్టడంలో వాడారు. విశాల వివాదాస్పద ఆవరణలోని చిన్నభాగంలో రాముడి జన్మస్థలం ఉన్నట్లు హిందువులు నమ్ముతూ వచ్చారు. 1855కు పూర్వమే రామ్‌ఛబుత్ర, సీతారసోయి అస్తిత్వంలో ఉండగా హిందువులు అక్కడ పూజలు చేస్తున్నారు. ఈ అంశమే భూమిపై కక్షిదారులకు ఉమ్మడిహక్కు కల్పించడానికి కోర్టుకు ఆధారమైంది.
జస్టిస్ అగర్వాల్:కట్టడాన్ని ముస్లింలు ప్రార్థనల కోసం ప్రత్యేకంగా ఉపయోగించలేదు. 1856-57 తర్వాత కట్టడం బాహ్య ఆవరణను హిందువులు విస్తృతంగా వాడుతూ వచ్చారు. లోపలి ఆవరణను హిందూ, ముస్లింలు ఇద్దరూ ప్రార్థనల కోసం వాడుతున్నారు.
జస్టిస్ శర్మ: హిందూ ఆలయ శిథిలాలపైనే మసీదును నిర్మించారు. భారత పురాతత్వ పరిశోధన సంస్థ(ఏఎస్‌ఐ) తవ్వకాల్లో 265 ఆధారాలు లభించాయి. ఏఎస్‌ఐ మాజీ డీజీ రాకేశ్ తివారీ నివేదికలోనూ పాత ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని స్పష్టంచేశారు.
విగ్రహాలు, ఇతర వస్తువులను 1949 డిసెంబరు 22 అర్ధరాత్రి ప్రార్థన స్థలంలో పెట్టారా? ముందునుంచే ఉన్నాయా?
జస్టిస్ ఖాన్, జస్టిస్ శర్మ:విగ్రహాలను ఆరోజు రాత్రి మసీదు గుమ్మటాల కింద పెట్టారు.
జస్టిస్ అగర్వాల్: ఆరోజు రాత్రే వాటిని అక్కడ పెట్టారనే విషయాన్ని రుజువు చేయలేం. కట్టడం బయట రామ్‌ఛబుత్రలో 1949 డిసెంబరు 22కు ముందు నుంచే ప్రతిమలు, పూజావస్తువులున్నాయి.
బాహ్య ఆవరణలోనే రామ్‌ఛబుత్ర, బంఢార్, సీతా రసోయి ఉన్నాయా? 1992లో వీటిని కూల్చేశారా?
వివాదాస్పద స్థలంపై 1885, 1950 సంవత్సరాలకు చెందిన చిత్రపటాలను ఆధారంగా చేసుకుని, మూడు కట్టడాలూ బాహ్య ఆవరణలోనే ఉన్నట్లు న్యాయమూర్తులు నమ్మారు. వీటిని 1992 డిసెంబరు 6న కూల్చేసినట్లు ముగ్గురు కక్షిదారులు సైతం అంగీకరించారు. ‘అయోధ్యలో 1766-1771 మధ్య భూభౌతిక శాస్త్రవేత్త టైఫెంథ్లార్ పర్యటించిన సమయంలో బాహ్య ఆవరణలోనే రాంఛబుత్రాను గుర్తించినట్లు జడ్జీలు సూచించారు.
వివాదాస్పద ఆస్తి ఎవరి అధీనంలో ఉంది. దీనిపై ఎవరికి హక్కులు ఉన్నాయి?
జస్టిస్ అగర్వాల్:వివాదాస్పదంగా మారిన లోపలి ఆవరణ ఎవరి అధీనంలోనూ లేదు. బాహ్య ఆవరణలో హిందువులు శతాబ్దానికిపైగా పూజలు చేస్తూనే ఉన్నారు.
జస్టిస్ శర్మ:వక్ఫ్ రికార్డుల ప్రకారం చూస్తే ముస్లింలు ఈ ఆస్తిపై ఏకపక్ష హక్కుదారులు కాజాలరు. మసీదు లోపలి స్తంభాలపై పలువురు హిందూ దేవుళ్లు, దేవతల పటాలున్నాయి. ఈ ప్రాంతాన్ని హిందూ, ముస్లింలు ఇద్దరూ దర్శించుకుంటున్నారు. కట్టడం నిర్మించిన తర్వాత కూడా తాము పూజలు కొనసాగిస్తున్నట్లు హిందువులు రుజువు చేసుకున్నారు. బాహ్య ఆవరణపై మాత్రమే వారికి హక్కులున్నాయి.
జస్టిస్ ఖాన్:మసీదును నిర్మించిన స్థలం బాబర్‌కు చెందినట్లుగా ముస్లింలు రుజువు చేసుకోలేకపోయారు. అక్కడ ఆలయం ఉండేదని హిందువులు కూడా రుజువులు చూపలేకపోయారు. ఈ కారణంగా వివాదాస్పద ప్రాంతంపై ఇద్దరికీ ఉమ్మడి హక్కులు ఉన్నాయి.
ఇదీ చూడండి: నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు