కరోనాతో కమ్ముకున్న కారుచీకట్లను పారదోలి, స్వయం సమృద్ధి సాధించటమే లక్ష్యంగా ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరిట భారీ ఉద్దీపన చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతంతో రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విమానయానం వంటి వివిధ రంగాలకు ఆర్థిక ఉపశమనం కల్పించే అంశాలను 5 విడుతలుగా వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.
అగ్ర దేశాల సరసన..
ప్రపంచవ్యాప్తంగా పలు అగ్రదేశాలు ప్రకటించిన అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీల్లో భారత్ ఒకటి కావటం గమనార్హం. భారత్ కన్నా ముందు వరుసలో జపాన్, అమెరికా, స్వీడన్, ఆస్ట్రేలియా, జర్మనీలు ఉన్నాయి.
149 దేశాల జీడీపీ కంటే అధికం
భారత్ ప్రకటించిన రూ.20 కోట్ల (265 బిలియన్ డాలర్లు) ప్యాకేజీలో పూర్తిగా కొత్త వ్యయాలు కావు. గతంలో పీఎంజీకేపీ కింద రూ. 1,92,800 కోట్లు, ఆర్బీఐ చర్యల్లోని రూ. 8,01,603 కోట్లు ఉన్నాయి. అయితే భారత ఉద్దీపన ప్యాకేజీ.. వియత్నాం, పోర్చుగల్, గ్రీస్, న్యూజిలాండ్, రొమేనియా వంటి 149 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. పాకిస్థాన్ వార్షిక జీడీపీ( 284 బలియన్ డాలర్లు)కి దాదాపు సమానం. జీడీపీ పరంగా ఉద్దీపన చర్యల్లో భారత్ 6వ స్థానంలో నిలిచింది. 10 మంది అగ్రస్థానంలోని ధనిక భారతీయుల సంపద (147 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారత ప్యాకేజీ 1.8 రెట్లు అధికం. భారత్‌లో అత్యధిక సంపన్నుడైన ముంఖేశ్ అంబానీ సంపదతో పోలిస్తే 5 రెట్లు అధికం.
వివిధ దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలు జీడీపీ పరంగా..
ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అగ్రదేశాల సరసన భారత్! - అమెరికా..కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో తొలిస్థానంలో ఉంది అగ్రరాజ్యం. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అన్ని దేశాల కంటే భారీ మొత్తంలో సుమారు 2.7 ట్రిలియన్ డాలర్లుతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అయితే.. జీడీపీ శాతం పరంగా చూస్తే జపాన్ కంటే అమెరికా వెనకంజలో ఉన్నట్లు ఆర్థికవేత్త సెహున్ ఎల్గిన్ రూపొందించిన డేటా ప్రకారం తెలుస్తోంది. అమెరికా జీడీపీలో ప్యాకేజీ 13శాతంగా ఉన్నట్లు అంచనా వేశారు.
- జపాన్..కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది జపాన్. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 21.1 శాతం ఉంటుంది. ఇతర దేశాలోతో పోలిస్తే ఇదే అధికం. ముందు ముందు మరింత ఎక్కువగా వ్యయం చేయాలని భావిస్తోంది ఆ దేశ ప్రభుత్వం.
- స్వీడన్..దేశ జీడీపీలో 12 శాతం మేర నిధులతో కరోనా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది.
- ఆస్ట్రేలియా.. దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీలో 10.8 శాతం నిధులతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
- జర్మనీ.. ఆర్థిక ప్యాకేజీలో భాగంగా సుమారు 815 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది జర్మనీ. అది జీడీపీలో 10.7 శాతం మేర ఉంటుంది.
- ఫ్రాన్స్.. తమ దేశ జీడీపీలో సుమారు 9.3 శాతానికి సమానమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.
- స్పెయిన్…ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ విలువ దేశ జీడీపీలో సుమారు 7.3 శాతం ఉంటుందని అంచనా.
- ఇటలీ…కరోనా మహమ్మారితో భారీగా నష్టపోయింది ఇటలీ. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 750 బిలియన్ యూరోల( 815 బిలియన్ డాలర్లు) ప్యాకేజీ ప్రకటించింది. అది దేశ జీడీపీలో సుమారు 5.7 శాతం.
- చైనా..కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనా అన్ని దేశాల కంటే ముందే ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. వైరస్ వ్యాప్తితో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు దేశ జీడీపీలో 3.8 శాతంతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.