సామాజిక మాధ్యమాల్లోనూ స్వయం సమృద్ధత దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్ 'ఎలిమెంట్స్' అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు పెద్దపీట వేస్తూ... "కనెక్ట్ గ్లోబల్లీ-షాప్ లోకల్లీ" నినాదంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్లయిన వెయ్యి మంది ఐటీ నిపుణులు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు.
ఎలిమెంట్స్ యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురువు రామ్‌దేవ్ బాబా, రామోజీ గ్రూప్ అధినేత రామోజీ రావు సహా మరికొందరు వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ దిశగా నిపుణులు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అందుకోసం దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలన్నారు.
" 8 భారతీయ భాషల్లో ఎలిమెంట్స్ యాప్ అందుబాటులో ఉండటం సంతోషదాయకం. ఎందుకంటే ప్రజలు ఇతర భాషల కంటే తమ మాతృభాషల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా ఉంటుంది. యాప్‌ను రూపొందించడంలో వృత్తి నిపుణులు చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం. వారు సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ విశిష్టతను ప్రదర్శించడమే కాదు.. ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులు వేసేందుకు కృషిచేశారు. ఈ యాప్ దేశంలో చాలా మంది ప్రజలు వినియోగిస్తున్న విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నా."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి