తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు ఘర్షణలో ఇరువైపులా భారీ ప్రాణనష్టం! - india china war update

20-indian-soldiers
సరిహద్దు ఘర్షణలో ఇరువైపులా భారీ ప్రాణనష్టం!

By

Published : Jun 16, 2020, 10:07 PM IST

Updated : Jun 17, 2020, 9:27 AM IST

03:34 June 17

'భారత్​-చైనా సరిహద్దు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం'

'భారత్​-చైనా సరిహద్దు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం'

తూర్పు లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయలో భారత్​-చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగి భారీగా ప్రాణ నష్టం జరిగిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది అగ్రరాజ్యం అమెరికా. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి.  

" 20 మంది సైనికులను కోల్పోయినట్లు భారత సైన్యం ప్రకటించింది. వారి కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఇరు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు మేము మద్దతిస్తాం. జూన్​ 2న అధ్యక్షుడు ట్రంప్​, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్​ సంభాషణలో భారత్​-చైనా సరిహద్దు అంశంపై చర్చించారు."  

                      - అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి. 

00:47 June 17

సరిహద్దులో హింసాత్మక ఘటన కలిచివేసింది: సోనియా

సరిహద్దులో హింసాత్మక ఘటన కలిచివేసింది: సోనియా

తూర్పు లద్ధాఖ్​లోని గాల్వన్​ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర బాధ, మనోవేదనకు గురిచేసిందన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.  

" వారి ధైర్య సాహసాలకు నా నివాళి. వీర జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను రక్షించేందుకు కలిసి కట్టుగా ఉంటాం. తూర్పు లద్ధాఖ్​లోని గాల్వాన్​ లోయలో భారత అధికారులు, జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన నివేదికలు తీవ్రంగా బాధించాయి." 

                     - సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు  

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యం తెలిపింది. అదే క్రమంలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని భారత అధికారులు అంచనా వేస్తున్నారు. 

00:08 June 17

ఇరు దేశాలు సంయమనం పాటించాలి: ఐరాస

తూర్పు లద్దాఖ్​లోని గాల్వల్​ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​, చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరినట్లు ఆయన అధికార ప్రతినిధి ఎరి కనెకో తెలిపారు.  

" భారత్​, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి హింస చెలరేగి, మరణాలు సంభవించినట్లు వచ్చిన నివేదికలతో ఆందోళన చెందాం. ఇరు వైపులా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు మాకు సానుకూల సమాచారం అందింది."  

                    - ఎరి కనెకో, ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి.

భారత్​, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. ఈ ఘటనలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు భారత్​ వర్గాలు భావిస్తున్నాయి. ఆ సంఖ్య 43గా అంచనా వేశాయి. 

23:07 June 16

వెనుదిరుగుతున్న సైన్యం...

తూర్పు లద్దాఖ్​లోని గాల్వన్​ లోయ నుంచి భారత్​-చైనా సైనికులు వెనుదిరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సోమవారం తలెత్తిన హింసాత్మక ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీ ప్రాణ నష్టం కలిగినట్టు తెలుస్తోంది.

22:45 June 16

తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య ఏప్రిల్‌ నుంచి  కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. తీవ్ర హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. సోమవారం రాత్రి ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది వరకు భారత సైనికులు వీర మరణం పొందినట్లు భారత సైన్యం తెలిపింది. 

చైనా వైపు మృతులు, గాయపడినవారు 43 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

21:57 June 16

భారీ ప్రాణనష్టం!

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. సోమవారం రాత్రి గాల్వన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో 20మందికిపైగా భారత సైనికులు అమరులైనట్టు సైన్యం తెలిపింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఘర్షణలో చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం కలిగినట్టు సమాచారం. అనేక మంది మరణించగా... తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సంఖ్య 43 అని భారత్​ వర్గాలు భావిస్తున్నాయి.

Last Updated : Jun 17, 2020, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details