అసోంలో జాతీయ పౌర రిజిస్ట్రర్ తుది జాబితా నేడు విడుదల కానుంది. ఆగస్టు 31వ తేదీలోపు జాబితా విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌సీ విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
కేంద్రం భరోసా
జాబితా విడుదల నేపథ్యంలో స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేరు ఉంటుందో ఉండదోనని భయపడుతున్నారు.
"నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను అన్ని ధ్రువపత్రాలు సమర్పించాను. 2011లో నేను ఓటు హక్కు వచ్చింది. ఓటర్, ఆధార్, పాన్ కార్డు పొందాను. నా పాఠశాల సర్టిఫికేట్లు కూడా ఇచ్చాను. 2,3 సార్లు పరిశీలించారు. అయినా నా పేరు జాబితాలో లేదు. అర్హులైన వారు పేర్లు జాబితాలో ఉండాలి. విదేశీయుల పేర్లను తొలగించి పంపించివేయాలి."
-నూర్జమాన్ ఖాన్, దుకాణదారుడు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సీ రూపకల్పన జరిగినందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. జాబితాలో పేరు లేకపోతే పైకోర్టులను ఆశ్రయించవచ్చని సూచిస్తోంది. అప్పీలు చేసుకునేందుకు గడువును 120 రోజులకు పెంచింది.
ఫారెన్ ట్రైబ్యునళ్ల పెంపు
ప్రస్తుతమున్న 100 ఫారెనర్ ట్రైబ్యునళ్లకు అదనంగా మరో 200 ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పు వ్యతిరేకంగా వస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని సూచిస్తున్నారు. అదే సమయంలో నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా న్యాయసహాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు.
ఆధార్ కార్డు
జాబితాలో కొత్తగా చోటు దక్కిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 2018 జూలై 30న ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో పేరు తొలగించిన తర్వాత భారతీయ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో 36 లక్షల మంది నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నారు. చోటు దక్కనివారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే ఆధార్ కార్డు పొందడానికి అనర్హులని తెలిపారు.
న్యాయ సహాయానికి పార్టీలు సన్నద్ధం
నిజమైన పౌరులకు అన్యాయం జరగకుండా రాజకీయ పార్టీలు న్యాయ సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా, కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసోంలోని 14 లోక్‌సభ స్థానాలకు గానూ 9 చోట్ల గెలుపొందింది భాజపా. రాష్ట్రంలోని మెజారిటీ బెంగాలీ హిందువులు తమకు మద్దతుగా నిలిచినట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు సన్నద్ధమవుతోంది.