రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో రెండు బీ777 విమానాలు తయారు చేయిస్తోంది భారత్. వీటిలో ఒకటి ఈ వారంలో భారత్కు రావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల డెలివరీ ఆలస్యమవుతుందని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.
బోయింగ్ నుంచి విమానాన్ని తీసుకునేందుకు ఎయిర్ ఇండియా అధికారులు ఈ నెల తొలినాళ్లల్లోనే అమెరికాకు వెళ్లారు. కానీ విమాన డెలివరీ ఆలస్యమైంది. మరో విమానం సెప్టెంబర్లో భారత్కు చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనాతో...
వాస్తవానికి ఈ విమానాలను బోయింగ్ జులైలోనే డెలివరీ చేయాల్సి ఉంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా సకాలంలో రాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ రెండు బీ777 విమానాలను భారత వాయుసేన పైలట్లు ఆపరేట్ చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యత మాత్రం ఎయిర్ ఇండియాదే.