తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మండలి'పై రాజ్యాంగం చెబుతోందేమిటి?- రెండో భాగం - amaravathi agitation

శాసన మండలి రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి- ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్‌.టి. రామారావు చూపిన బాటలో నడవటం చిత్రమైన పరిణామం. మరి శాసన మండలి రద్దుపై భారత రాజ్యాంగం చెబుతున్న అంశాలు, ఈ విషయంలో తుది నిర్ణయం ఎవరిదనే అంశమై నిన్నటి కథనానికి కొనసాగింపు.

council
‘మండలి’పై రాజ్యాంగం చెబుతోందేమిటి?

By

Published : Feb 4, 2020, 7:43 AM IST

Updated : Feb 29, 2020, 2:28 AM IST

రాజ్యాంగంలో శాసన మండలికి సంబంధించిన నిబంధనలను చూశాం. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగనున్నదో పరిశీలించాలి. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలంటూ శాసన సభ తీర్మానించిన దరిమిలా వ్యవహారం పార్లమెంటుకు చేరింది. ముందే చెప్పుకొన్నట్లు పార్లమెంటు ఈ తీర్మానాన్ని విధిగా ఆమోదించాలని లేదు. రాజ్యాంగం ప్రకారం దాన్ని పార్లమెంటు ఆమోదించవచ్చు లేక ఆమోదించకపోనూవచ్చు. అదీకాకుండా ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో అనేక కీలకమైన అంశాలు చర్చకు వస్తాయి కాబట్టి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి వ్యవహారం గురించి పట్టించుకునే ఓపిక, తీరిక పార్లమెంటుకు ఉండకపోవచ్చు. అంతేకాక పార్లమెంటుకు ఈ నెల 12 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు విరామ సమయం. అందువల్ల ఏపీ శాసన మండలిపై వెంటనే ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం గట్టిగా సంకల్పిస్తే తప్ప వ్యవహారం తెమలదు. ఈ విషయంలో కొంత ఆలస్యం అనివార్యమయ్యేట్లుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయనే ప్రశ్న వస్తుంది.

మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును రాష్ట్ర శాసన మండలి మూడు నెలల లోపల శాసన సభకు తిప్పి పంపవచ్చు. ఆలా పంపేటప్పుడు పై రెండు బిల్లులపై తన వ్యాఖ్యలను, సవరణలను సూచించవచ్చు. వాటిని శాసన సభ అనివార్యంగా పరిశీలించాల్సిందే కానీ, మండలి సూచించిన మార్పుచేర్పులను శాసన సభ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. పరిశీలన పూర్తయ్యాక శాసన సభ మళ్లీ ఆ రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్‌ సమ్మతి కోసం పంపుతుంది. అప్పటి నుంచి 200, 201వ రాజ్యాంగ అధికరణలు రంగప్రవేశం చేస్తాయి. బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని గవర్నర్‌ నిర్ణయించుకుంటే, 200వ రాజ్యాంగ అధికరణ ప్రకారం నిక్షేపంగా ఆ పని చేయవచ్చు. అదే జరిగితే రాష్ట్రపతి రెండు బిల్లులకూ ఆమోదం తెలపవచ్చు లేదా ఆమోదాన్ని బిగపట్టవచ్చు. ఒకవేళ తక్షణం ఆమోదించకపోతే ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేచర్‌ రెండు బిల్లులనూ ఆరునెలల్లోగా పునఃపరిశీలించి పంపాలంటూ తిప్పిపంపవచ్చు. అలా వాపసు వచ్చిన బిల్లులను రాష్ట్ర శాసన సభ, శాసన మండలి (అది ఇంకా రద్దు కాకుండా ఉంటే) మళ్లీ ఆమోదించి, రాష్ట్రపతికి పంపాలి. ఈసారి రాష్ట్రపతి వాటిని తప్పక ఆమోదించాల్సిందేనా అనే అంశంపై రాజ్యాంగం ఏమీ చెప్పడం లేదు. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

చట్ట సభల్లో ఎగువ సభ ఆవశ్యకత మొదటి నుంచీ చర్చనీయాంశంగానే ఉంది. 18వ శతాబ్ది చివర్లో అమెరికా రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు ఈ అంశంపై జాతి నిర్మాతల మధ్య రసవత్తరమైన చర్చ జరిగినట్లు చెబుతారు. బ్రిటిష్‌ వలస పాలన నుంచి స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటానికి నాయకత్వం వహించిన ఎనిమిదిమంది అమెరికన్‌ జాతి నిర్మాతలు స్వరాజ్యం సాధించిన తరవాత రాజ్యాంగ నిర్మాణమూ చేపట్టారు. అమెరికాలో పరిపాలన ఎలా సాగాలనే అంశంపై వారు వెలువరించిన కీలక పత్రాలు ఇప్పటికీ ఆ దేశానికి మారదర్శకత్వం వహిస్తున్నాయి.

ఎడతెగని చర్చ

భారతదేశంలో ఎగువ సభ పాత్ర, విధుల గురించి రాజ్యాంగ నిర్మాతల మధ్య తర్జనభర్జన జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో కొంతమంది ఎగువ సభ అవసరాన్ని ప్రశ్నించారు. దానికి పెద్దలు ఇచ్చిన సమాధాన సారాంశం- సాధారణ ప్రజలు తమ ప్రతినిధులను లోక్‌సభకు ఎన్నుకుంటారు. వారు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారు కాబట్టి సహజంగానే సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. ఎవరి పంతం వారిదే అన్నట్టు ఉంటుంది. విద్యావంతులు, లబ్ధప్రతిష్ఠులూ ఎన్నికయ్యే రాజ్యసభలో దీనికి భిన్నంగా చట్టాలపై నింపాదిగా నిర్వికారంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఎగువ సభ అవసరమని చాలామంది సభ్యులు వాదించారు.

ఎగువ సభ ఉండి తీరాల్సిందేనని ఎన్‌.గోపాలకృష్ణ అయ్యంగార్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనాలపై రాజ్యసభలో హుందాగా చర్చలు జరుగుతాయనీ, ఆవేశకావేషాలు సద్దుమణిగేవరకు శాసనం అమలులోకి రాకుండా కొంతకాలం నిలిపి ఉంచడానికి ఎగువసభ తోడ్పడుతుందని ఆయన అన్నారు. రాజ్యసభ అనేది వ్యవహారం జోరుగా ముందుకెళ్లకుండా కొంత ఆలస్యం చేసే సాధనమన్నారు. దీనివల్ల అనుభవజ్ఞులైన సభ్యులు లోతుగా విశ్లేషించి తగు సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం చిక్కుతుందన్నారు. రాజ్యసభ శాంత గంభీరంగా వ్యవహారం నడిపే సభ అని లోక్‌నాథ్‌ మిశ్రా వర్ణించారు. ఇంకా అది సమీక్షించే సభ అనీ, శాసన నాణ్యతను సంరక్షించే సభ అని కూడా సూత్రీకరించారు. కీలక సమస్యల గురించి విస్తృత పరిజ్ఞానం, గాఢమైన అవగాహన ఉన్నవారు రాజ్యసభకు ఎన్నికవుతారు కాబట్టి శాసన సంబంధ సమస్యలపై వారి మాటలకు సలహాలకు ఎంతో విలువ ఉంటుందన్నారు. విద్వత్తు, నైపుణ్యం, అపార అనుభవం ఉన్నా తమంతట తాము పార్లమెంటుకు ఎన్నిక కాలేని మేధావులు, ప్రజాసేవకులు, పరోపకారులకు రాజ్యసభ స్థానం కల్పిస్తుందని అనంతశయనం అయ్యంగార్‌ పేర్కొన్నారు. వారి ద్వారా ప్రజల ఆశలు, ఆశయాలు పార్లమెంటు దృష్టికి వస్తాయన్నారు.

దీనికి భిన్నమైన స్వరాలూ వినిపించాయి. ఎగువ సభ ఏ దేశంలోనూ ప్రగతికి దోహదం చేయలేదని ప్రొఫెసర్‌ సిబ్బన్‌ లాల్‌ సక్సేనా వాదించారు. ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే లోక్‌ సభకు ఆటంకాలు సృష్టించే సామ్రాజ్యవాద సాధనంగా బ్రిటిష్‌ వలస పాలకులు ఎగువసభను సృష్టించారని మహమ్మద్‌ తాహిర్‌ వ్యాఖ్యానించారు.

రూపాంతరం చెందాలి

ఏదిఏమైనా నేడు రాష్ట్రాల్లో శాసన మండళ్లు రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా లేవంటే సత్యదూరం కాదు. వాటి కూర్పు లోపభూయిష్ఠంగా ఉందనీ, కాలం చెల్లిన పద్ధతులను ఇంకా పట్టుకు వేలాడుతున్నారనీ ఒప్పుకోక తప్పదు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. ఆ వాతావరణంలో శాసన మండలిలో పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు కొన్ని సీట్లు కేటాయించారంటే అర్థం ఉంది. ఇప్పుడు విద్యావంతుల సంఖ్య బాగా పెరిగినా పాత పద్ధతినే ఇప్పటికీ కొనసాగించాలా అనే ప్రశ్న తలెత్తుతుంది. మన రాజ్యాంగం మొదట్లో కేంద్రం, రాష్ట్రాలకు పరిమితమైన రెండంచెల పాలనా వ్యవస్థను ఉద్దేశించింది. తరవాత 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడో అంచె అయిన పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధత, రక్షణ కల్పించారు. 73వ సవరణ గ్రామ పంచాయతీలకు, 74వ సవరణ నగర పాలికలకు సంబంధించినవి. 171వ రాజ్యాంగ అధికరణ శాసన మండలి కూర్పును నిర్దేశిస్తోంది. ఒక రాష్ట్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసన సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మూడో వంతుకు మించకూడదని ఈ అధికరణ పేర్కొంటోంది. అదే సమయంలో మండలి సభ్యుల సంఖ్య నలభైకి తగ్గకూడదని పేర్కొంది. మండలి సభ్యుల సంఖ్యను మార్చాలంటే పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుందని ఈ అధికరణలోని రెండో క్లాజు సూచిస్తోంది. దీనికింద శాసన మండలి, పంచాయతీ రాజ్‌ సంస్థల నిర్మాణం, కూర్పులను సంధానిస్తూ చట్టం చేయాలి. రెండింటి మధ్య సజీవ బంధం ఏర్పరచాలి. వివిధ రంగాలకు చెందినవారికి మండలిలో కేటాయించిన స్థానాలను గవర్నర్‌ నామినేషన్‌ పద్ధతిలో భర్తీ చేయవచ్చు.

ఈ విధమైన పునర్వ్యవస్థీకరణ జరిపితే శాసన మండళ్ల చర్చలకు మరింత ఎక్కువ విలువ, ప్రాధాన్యం చేకూరతాయి. అవి కూడా శాసన సభల్లా స్థిరంగా కొనసాగుతూ రాజ్యాంగ నిర్మాతల అభిమతం నెరవేరుస్తాయి. మరిన్ని రాష్ట్రాలు శాసన మండళ్ల ఏర్పాటుకు ముందుకొస్తాయి.

ఎగువసభ ఎందుకంటే...

ఎనిమిదిమంది జాతి నిర్మాతల్లో ఒకరైన జార్జ్‌ వాషింగ్టన్‌ను అమెరికా జాతి పితగా పరిగణిస్తారు. మరో జాతి నిర్మాత థామస్‌ జెఫర్సన్‌ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రచించిన నాయకుడిగా సుప్రసిద్ధుడు. వాషింగ్టన్‌, జెఫర్సన్‌ ఇద్దరూ అమెరికా అధ్యక్షులుగా పాలన రథం నడిపినవారే. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో దిగువ సభను ప్రజా ప్రతినిధుల సభ అంటారు. ఎగువ సభ ‘సెనెట్‌’- పేరుకు మన రాజ్య సభ వంటిదే కానీ దానికి ఉన్న అధికారాలు ప్రపంచంలో మరే ఎగువ సభకూ లేవు. చిత్రంగా అమెరికాలో ఎగువ సభ అవసరమా అనే మీమాంసను జెఫర్సన్‌ ఒక రోజు అల్పాహార సమయంలో జార్జ్‌ వాషింగ్టన్‌ వద్ద లేవనెత్తారు...

అమెరికా దిగ్గజ నేతలు

జెఫర్సన్‌ : అసలు కాంగ్రెస్‌ లో రెండు సభలు ఉండాల్సిన అవసరమేమిటి, దిగువ సభతోనే పని జరగదా?
వాషింగ్టన్‌ : కాఫీని నేరుగా కప్పు నుంచి తాగకుండా అలా సాసర్‌లో పోస్తున్నారేం?
జెఫర్సన్‌ : వేడివేడి కాఫీని కాస్త చల్లబరచడానికే సాసర్‌లో పోస్తున్నా...
వాషింగ్టన్‌ : అలాగే హాటు హాటు చట్టాన్ని కాస్త చల్లబరచడానికి ఎగువ సభ అనే సాసర్‌ అవసరమని గుర్తించండి.

- వివేక్​ కే. అగ్నిహోత్రి
(రచయిత-రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్​)

ఇదీ చూడండి: 'మండలి'పై రాజ్యాంగం చెబుతోందేమిటి?

Last Updated : Feb 29, 2020, 2:28 AM IST

ABOUT THE AUTHOR

...view details