తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మన అన్నదాతకు పండగెక్కడయ్యా? - అన్నదాత దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు

అన్నదాత దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. సాగు ఖర్చులు బరువై.. పెట్టుబడి సౌకర్యాలు కరవై.. ఆదుకునేవారు మృగ్యమై.. విపత్తులతో వికలమై భారంగా బతుకీడుస్తున్నాడు. దేశవ్యాప్తంగా 2018 సంవత్సరంలో బలవన్మరణాలకు పాల్పడిన రైతులు, వ్యవసాయ కూలీల సంఖ్య 10,349. సాగుదారుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాలను మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటకలే దక్కించుకున్నాయి. కర్షకుల బతుకులకు చితి పేర్చే దురవస్థ సమసిపోయినప్పుడే శ్రమజీవుల కుటుంబాలకు నిజమైన సంక్రాంతి. రైతును నిలబెడితేనే దేశం సొంతకాళ్లపై నిలదొక్కుకుంటుంది.

farmers
అన్నదాతకి పండగెక్కడయ్యా?

By

Published : Jan 12, 2020, 8:00 AM IST

Updated : Jan 12, 2020, 11:55 AM IST

పేరుకే మనది వ్యవసాయ ప్రధాన దేశం. వాస్తవంలో, ఇక్కడి సేద్య వైకుంఠపాళిలో నిస్సహాయ రైతాంగానికి దాపురిస్తున్నది నిత్య సర్పగండం. విపణి శక్తులు, ప్రకృతి విపత్తుల వికృత కేళిలో విలవిల్లాడుతూ- పండిన పూటా పండుగ చేసుకోలేని దుస్థితిలో అన్నదాత కూరుకుపోతున్నాడు. జాతికి ఆహార దినుసులు సమకూర్చే కృషిలో నిమగ్నమైన పాపానికి ఎప్పటికప్పుడు ఘోరంగా ఓడిపోతున్నాడు. రైతుల ముఖ్య పర్వదినంగా పాఠ్యపుస్తకాల్లో చదువుకునే సంక్రాంతికి నాలుగు రోజులముందు జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఆరుగాలం శ్రమించి గిట్టుబాటు ఎండమావై పెట్టుబడులకు ఠికాణా లేక బతుకులు బండబారుతున్న సాగుదారుల వ్యధార్త జీవన చిత్రాన్ని అవి కళ్లకు కడుతున్నాయి.

గణాంకాలు

దేశవ్యాప్తంగా 2018 సంవత్సరంలో బలవన్మరణాలకు పాల్పడిన రైతులు, వ్యవసాయ కూలీల సంఖ్య 10,349. సాగుదారుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో తొలి రెండు స్థానాలను మళ్ళీ మహారాష్ట్ర, కర్ణాటకలే దక్కించుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనే 58 శాతం దాకా అన్నదాతల చావులు వెలుగు చూశాయంటే- అక్కడ ఏ స్థాయిలో నైరాశ్యం పేరుకుపోయిందో వేరే చెప్పనక్కరలేదు. జాబితాలో మూడు నాలుగు స్థానాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. దేశం నలుమూలలా 2016 సంవత్సరంలో 11,379 మంది, మరుసటి ఏడాది 10,655 మంది రైతులు వ్యవసాయ కూలీలు ఉసురుతీసుకోగా 2018లో ఆ సంఖ్య మూడు వందలదాకా తగ్గడం గొప్ప విశేషమని చంకలు కొట్టుకునే వీల్లేదు.

ఏటా పది వేలమందికి పైగా ఇలా హతమారిపోతుండటం, ప్రతి రోజూ సగటున రెండు వేలమంది వరకు కాడీమేడీ వదిలేసి వేరే బతుకుతెరువు వెతుక్కోవడం అంతులేని కథగా కొనసాగుతున్న దురవస్థ జాతికే సిగ్గుచేటు. కర్ణాటక లాంటిచోట్ల నిరుడు కొంతమంది రైతుల ఆత్మహత్యలకు ఇతరత్రా కారణాలు అంటగట్టి మృతుల పద్దును తక్కువ చేసి చూపించాలన్న అధికార యంత్రాంగం కొద్దిబుద్ధులు రచ్చకెక్కాయి. అలా మరెన్నిచోట్ల ఇంకెందరి నిస్సహాయ బలవన్మరణాలు మరుగునే పడి ఉండిపోయాయో ఎవరికెరుక? పశ్చిమ్‌ బంగ, బిహార్‌, ఒడిశా వంటిచోట్ల రైతులు, కూలీల అర్ధాంతర మరణాలు ఒక్కటీ నమోదు కాలేదు! సాగుదారుల విషాదాంతాలపై ఎవరెన్ని తెరచాటు విన్యాసాలు వెలగబెట్టినా- రైతు శోకం జాతికి శాపం. ఒక్క రైతైనా ఎందుకు బలవన్మరణానికి తెగబడాలి?

చావుడప్పు ఆగకుండా మోగుతుంది

జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారమే 1995-96 నుంచి దేశంలో మూడున్నర లక్షల మందికి పైగా కర్షకులు, కూలీలు చస్తూ బతకలేక పురుగుల మందు తాగి, మెడకు ఉరితాడు బిగించుకుని... చుట్టుముట్టిన కష్టాల నుంచి విముక్తి కోరుకున్నారు. ఇప్పటికీ ఆ చావుడప్పు ఆగకుండా మోగుతూనే ఉంది. ఇంతమంది రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నవేమిటో బహిరంగ రహస్యం. మూడొంతులకు పైగా రైతులు చిన్న కమతాలపైనే ఆధారపడి బతుకీడుస్తున్న దేశం మనది. ఏటికేడాది సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పెట్టిన ఖర్చుకు, అరకొర రాబడికి పొంతన కుదరక, మళ్ళీ పంటకు మరికొంత అప్పు చేయక తప్పని రైతన్నకు- వ్యవస్థాగత పరపతి అందని మానిపండు, పంటల బీమా రక్షణ ఎండమావి, గిట్టుబాటు వట్టి పగటికల.

కౌలుదారుల పరిస్థితి మరీ దారుణం. సర్కారీ పథకాలు దస్త్రాలకే పరిమితం కారాదని, రైతు ఆత్మహత్యల సమస్యకు నష్టపరిహారం చెల్లింపులే పరిష్కారం కాదని సుప్రీంకోర్టే కరాఖండీగా చెప్పినా- క్షేత్రస్థాయిలో పరిస్థితి మారక, వెతలు తీరక... అభాగ్య సాగుదారులెందరో చావే శరణ్యమనుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన దురదృష్టవంతుల సంబంధీకులకు చేకూరుతున్న ఉపశమనం అంతంతమాత్రమే. మృతిని ధ్రువీకరించే ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌), శవపరీక్ష నివేదిక ఉన్నా- ప్రభుత్వ సాయానికి నోచని కుటుంబాలెన్నో! తమ కుటుంబానికి పెద్దదిక్కును ఉన్నట్టుండి పోగొట్టుకున్నవారు కాళ్లావేళ్లా పడినా ఆయా ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్‌ కార్యాలయాలకు చేరక, చేరినా రెవిన్యూ యంత్రాంగం ఉదాసీన వైఖరుల మూలాన మరణ కారణాలు మారిపోయి... ఆర్థిక సాయం హుళక్కి అవుతున్న ఉదంతాలకు లెక్కేలేదు.

స్థూల దేశీయోత్పత్తిలో వాటా తగ్గుతుంది

రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నాయంటే కుదరదని, దేశంలో ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని 2015 ఆగస్టులో సుప్రీంకోర్టు చెప్పింది. మన్నన దక్కినదెక్కడ? జాతి ఆహార భద్రత బాధ్యతను నెత్తికెత్తుకున్న అన్నదాతలను పస్తుపెట్టే విపరీత ధోరణుల కారణంగానే ఆరున్నర దశాబ్దాలుగా స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 51 శాతం నుంచి ఎకాయెకి 14 శాతానికి తెగ్గోసుకుపోయింది. ప్రాణాంతక సేద్యం లాయకీ కాదన్న అభిప్రాయం రైతాంగంలో వేళ్లూనుతుండగా, లక్షల ఎకరాల్లో పొలాలు స్థిరాస్తి వెంచర్లుగా మారిపోతున్నాయి. ఇటువంటప్పుడు రైతన్న కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాలు తూతూమంత్రం చర్యలతో సరిపుచ్చితే- దేశ ఆహారావసరాలు తీరడానికి విదేశాల్ని దేబిరించాల్సిన దౌర్భాగ్యం ఎంతో దూరంలో లేదు!

నిజమైన సంక్రాంతి

ఏ కారణంగానైనా రైతులు ఇక్కట్ల పాలైనప్పుడు ఐరోపా దేశాలు తక్షణ ఉదార చర్యలతో ఆదుకుంటున్నాయి. ఆరేళ్లనాడు అమెరికా- విపత్తు నష్టాలు మొదలు విపణిలో ధరవరల క్షీణత వరకు ప్రతి దశలోనూ సాగుదారులకు అండగా నిలిచే నిబంధనలతో ప్రత్యేక చట్టం ఆమోదించి అమలుపరుస్తోంది. అదే ఇక్కడ- కోత ఖర్చులూ రాని ధర విని కడుపు రగిలిపోయి కంటికి రెప్పలా సాకిన పంటకు రైతే చేజేతులా నిప్పు పెడుతున్న విషాద ఘట్టాలు పదేపదే పునరావృతమవుతున్నాయి! అన్నదాతను, దేశ విస్తృత ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో సేద్యాన్ని గిట్టుబాటయ్యేలా చూడాలన్న స్వామినాథన్‌ మేలిమి సిఫార్సుల్నీ పేరబెడుతున్నారు.

రైతుల బలవన్మరణాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం అమలుపరచదగ్గ 14 సూత్రాల కార్యాచరణ నాలుగేళ్ల క్రితమే సిద్ధమైంది. దేనినైనా వాయిదా వేయవచ్చుగాని, వ్యవసాయ రంగంపై నిర్ణయాల్లో ఎటువంటి జాప్యం పనికిరాదనేవారు ప్రథమ ప్రధాని నెహ్రూ. ఇప్పుడు పథకాలు, వ్యూహాలు, సంకల్పాలు, లక్ష్యాలు ఎన్ని మోతెక్కుతున్నా- సరైన గిట్టుబాటు, సకాలంలో రుణాలు, సక్రమ విపణి వ్యవస్థ, చౌకలో ఉత్పాదకాలు, అర్థవంతమైన శాస్త్రీయ సహకార ప్రోత్సాహకాల జోలికి పోతున్నాయా ప్రభుత్వాలు? తన ప్రమేయం లేని చీడపీడలు, ప్రకృతి ఉత్పాతాలు, విపణి శక్తుల మాయాజాలాలు, దళారుల దాష్టీకాలకు రైతే మూల్యం చెల్లించే దుర్మార్గం ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? కడగండ్ల సేద్యం కర్షకుల బతుకులకు చితి పేర్చే దురవస్థ సమసిపోయినప్పుడే శ్రమజీవుల కుటుంబాలకు నిజమైన సంక్రాంతి. రైతును నిలబెడితేనే దేశం సొంతకాళ్లపై నిలదొక్కుకుంటుంది. ఏమంటారు?

ఇదీ ేచూడండి : 'మహిళా ఆర్మీ పోలీసుల శిక్షణ 6న ప్రారంభం'

Last Updated : Jan 12, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details