తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు: సీసా పెట్టు.. రెండు రూపాయలు పట్టు.! - KARNATAKA PLASTIC BAN

కర్ణాటకలోని అంచట్​గెరి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బసవరాజ్​ బిద్నాల్​ వినూత్న ఆలోచనతో ఆ ప్రాంతాన్ని ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దారు. బడి పిల్లల నుంచి ప్లాస్టిక్​ సీసాలు సేకరిస్తున్నారు. బదులుగా ప్రతి సీసాకు వారికి రూ.2 ఇస్తున్నారు. దీని వల్ల గ్రామం పరిశుభ్రంగా మారి.. ఎక్కడా ప్లాస్టిక్​ వ్యర్థాలు కనిపించకుండా పోయాయి. బసవరాజ్​.. తన ఆలోచనతో ఎందరినుంచో మన్ననలు పొందుతున్నారు.

Anchatgeri village in Dharwad district of Karnataka stands as an example for banning the plastic
ప్లాస్టిక్​పై పోరు: సీసా పెట్టు.. రెండు రూపాయలు పట్టు.!

By

Published : Dec 29, 2019, 7:33 AM IST

ప్లాస్టిక్​పై పోరు: సీసా పెట్టు.. రెండు రూపాయలు పట్టు.!

సాధారణంగా బడి పరిసరాల్లో పీచుమిఠాయి, ఐస్​క్రీమ్​ డబ్బాలు దర్శనమిస్తాయి. పిల్లలు అవి చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ కర్ణాటకలోని ధార్వాడ్​ జిల్లాకు చెందిన అంచట్​గెరి గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నం. ఆ బడి గేట్లు తెరిచిన వెంటనే ఓ వ్యక్తి.. తన సంచితో అక్కడ నిలబడతారు. పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. తమ దగ్గర ఉన్న ప్లాస్టిక్​ సీసాలను ఆ సంచిలో వేసి వెళ్తారు. ఆ వ్యక్తి పేరు బసవరాజ్​ బిద్నాల్​. ఆయన ఆ ఊరి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు.

కర్ణాటకలో ప్లాస్టిక్​పై యుద్ధం ప్రకటించి విజయం సాధించిన కొన్ని గ్రామాల్లో ముందువరుసలో ఉంటుంది అంచట్​గెరి. ఒకప్పుడు పట్టి పీడించిన ప్లాస్టిక్​ సమస్య నుంచి ఆ గ్రామాన్ని విముక్తి చేయడంలో... బసవరాజ్​ ఆలోచనదే కీలక పాత్ర.

గ్రామాన్ని ప్లాస్టిక్​ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి పిల్లల సహాయం తీసుకున్నారు బసవరాజ్​. బడి పిల్లలు సేకరించిన ప్లాస్టిక్​ సీసాలు, చేతి సంచులు పంచాయతీ అధ్యక్షుడికి అందిస్తే.. వాటికి బదులుగా ఆయన వారికి 2 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు. దీని వల్ల గ్రామం పరిశుభ్రంగా మారింది. ఇలా ఇప్పటి వరకు 16వేల ప్లాస్టిక్​ సీసాలను సేకరించడం విశేషం.

"తొలుత గ్రామంలో ఈ ఆలోచనను అమలు చేయడానికి ఎంతో ఇబ్బందిపడ్డాను. ప్లాస్టిక్​ను నిషేధించడానికి గ్రామస్థులు అంగీకరించలేదు. పాఠశాల పిల్లల చేత గ్రామస్థుల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నించాం. మొత్తం 650 విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అప్పుడు వాళ్లలో మార్పు వచ్చింది. ఒక ప్లాస్టిక్​ సీసా అందిస్తే రూ.2 ఇస్తామని ప్రకటించాం. గ్రామాన్ని ప్లాస్టిక్​ రహిత ప్రదేశంగా మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడింది."
--- బసవరాజ్​, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు

బసవరాజ్ ప్రయత్నానికి మోదీ ప్రశంస...​

భారత్​ను ప్లాస్టిక్​ రహిత దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా గుజరాత్​ సబర్మతీ ఆశ్రమంలో నిర్వహంచిన ఓ వేడుకలో బసవరాజ్​ను ఘనంగా సన్మానించారు. బసవరాజ్​ చేస్తున్న కృషిని ఎంతో అభినందించారు.

అప్పటి నుంచి బసవరాజ్​ ప్రసిద్ధి చెందారు. తన వద్దకు కళాశాల విద్యార్థులు కూడా వచ్చి.. ప్లాస్టిక్​ను నిషేధించడానికి మరింత అనువుగా ఓ ప్లాస్టిక్​-బ్యాంకును ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ఒకప్పుడు బసవరాజ్​ ఆలోచనను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు ఆయన వెంట నడుస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details