తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉదాసీనత వీడితే వారసత్వ సంపదతో ఉపాధి

వారసత్వ సంపద చుట్టూ పర్యటక రంగం ప్రస్తుతం పరిభ్రమిస్తుంది. వివిధ దేశాలు వారసత్వ సంపదను ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటక రంగం విశిష్టత, అందుకు కావాలసిన చేయూత, ప్రస్తుతం నెలకొన్న సవాళ్లపై తిరుమల ఎస్వీ మ్యూజియం మాజీ సంచాలకులు రంగనాయకులు విశ్లేషణ.

వారసత్వ సంపద- నయా ఆదాయ మార్గం!

By

Published : Aug 6, 2019, 6:05 PM IST

ప్రపంచంలో ప్రతి దేశానికీ తనదైన వారసత్వ చరిత్ర ఉంటుంది. అది తమకు గర్వకారణమని ఆయా దేశాల ప్రజలు భావిస్తుంటారు. ఆ ఘన చరిత్ర ఆనవాళ్లను ప్రపంచానికి చూపించడం ద్వారా గుర్తింపు, గౌరవం, ఆదాయం సమకూర్చుకోవాలని ప్రతి దేశం అనుకోవడం సహజం. ప్రపంచంలో ఏటా 150 కోట్లకు పైగా పర్యటకులు వివిధ దేశాలు సందర్శిస్తున్నారు. వారిలో కోటి మంది మాత్రమే భారత్‌లో పర్యటిస్తున్నారు. సహజంగా వీరిలో సమీప దేశాలవారే ఎక్కువగా ఉంటారు. ఈ సంఖ్య పెరగడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. వచ్చే పదేళ్లలో పర్యటకుల సంఖ్యను మరింత పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

లోపాలు సవరించాలి...

పర్యటకులకు కావలసింది భద్రత, పరిశుభ్రత. ఈ పరిస్థితులను చక్కదిద్దకుండా పర్యాటక రంగం ముందుకు పోలేదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రకృతిపరంగా దేశంలో ఉన్న సుందర ప్రదేశాలను పరిశుభ్రంగా నిర్వహించుకోవడం అత్యంత ముఖ్యం. భారతీయులు ఎక్కువగా తమ దేశంలోని ప్రదేశాలనే సందర్శిస్తుంటారు. పర్యటకం మంచి ఆదాయ వనరుగా మారింది. ఈ రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి ఆదాయం లభిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల కన్నా ఇందులో పని తక్కువ, ఆదాయం ఎక్కువ. పర్యటక రంగం వృద్ధి చెందితే ప్రజల్లో ఆయా అంశాలపై అవగాహన, విజ్ఞానం పెరుగుతాయి. ఈ కారణంగానే వివిధ దేశాలు ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. పర్యటకుల సంఖ్యలో భారత్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నా ప్రమాణాల స్థాయిలో మాత్రం అడుగున ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ లోపాలను సరిదిద్దుకున్నట్లయితే పర్యటకంలో దేశం దూసుకుపోగలదు.

భారత చరిత్రే దిక్సూచీ

భారతదేశ చరిత్ర, సంస్కృతి ప్రత్యేకమైనవని ప్రపంచం గుర్తించింది. ఎవరి దేశచరిత్ర వారికి గొప్పదైనా, భారతీయుల చరిత్ర ఇతర చరిత్రలు ఇవ్వలేని గొప్ప సందేశాలను అందించింది. క్రీ.పూ.మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి నేటి ఒడిశా రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్‌ దగ్గర గల దయా నది ఒడ్డున వేయించిన శాసనం ఇందుకు ఉదాహరణ. రెండో ప్రపంచ యుద్ధం తరవాత 1940లలో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించినప్పుడు నాటి ముసాయిదాలో ఏమి రాశారో అవే మాటలను సుమారు 2250 సంవత్సరాల ముందే అశోకుడు రాయించాడు. యుద్ధాలు లేకుండా అందరం ప్రశాంతంగా బతుకుదామని, యుద్ధాలవల్ల నష్టమే ఎక్కువని, మనుషులే కాక వన్యమృగాలు సైతం స్వేచ్ఛగా ఉండాలని అలనాటి శాసనంలో అశోకుడు పేర్కొన్నాడు. ఇవే మాటలను ప్రపంచదేశాలు ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నాయి.

వలసవాదులకు ఊరట

ప్రపంచ చరిత్రలో అలెగ్జాండర్‌, జూలియస్‌ సీజర్‌, చెంఘిజ్‌ ఖాన్‌లకు గొప్పవారన్న పేరుంది. అయితే వారి చేతిలోనే లక్షలమంది మృతిచెందారన్న విషయాన్ని మరచిపోరాదు. భారత్‌ మాత్రం- యుద్ధాలు వద్దన్న అశోకుడిని, అధికారాన్ని త్యజించిన మహావీరుడిని, నిర్వాణ మార్గాన్ని చూపిన గౌతమ బుద్ధుడిని, మత సామరస్యాన్ని కాంక్షించి దీన్‌-ఇ-ఇలాహిని స్థాపించిన అక్బర్‌ను, ఆయుధాలు లేకుండా స్వాతంత్రాన్ని సాధించిన గాంధీని గొప్పవారని కీర్తించింది. అదే భారత్‌ ప్రత్యేకత. అందువల్లనే ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయి. పశ్చిమాసియా నుంచి వచ్చిన పార్సీలను, జొరాస్ట్రీయులను, ఏనాడో వచ్చిన యూదులను, ఏడో శతాబ్దిలోనే వచ్చిన నూతన మహమ్మదీయులను భారత్‌ అక్కున చేర్చుకుంది. ఈ ఒరవడి దేశ చరిత్రలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మూడువేల సంవత్సరాల నాటి చారిత్రక శిథిలాలు, సాహిత్యం, జ్ఞాపకాలు... భారత్‌ ఆస్తి. ఇవి దేశ వారసత్వ సంపదకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి.

చరిత్రంతా... ప్రపంచ సంపదే

ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్‌ ఏడాది పొడుగునా పర్యటకులతో కిటకిటలాడుతుంటుంది. ఆ దేశ ఆర్థిక రంగానికి పర్యటకమే ప్రాణవాయువు. 11 శాతం ఆదాయం దీని నుంచే వస్తుంది. లక్షలమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈజిప్ట్‌లోని చారిత్రక స్థలాలు, కట్టడాలు అక్కడి ప్రజల వారసత్వంలా కనిపించవు. నైలునదీ నాగరికత వారసులు ఎవరో నేటికీ తెలియదు. ఆ దేవతలను పూజించే వారూ లేరు. అంతమాత్రాన ఈజిప్ట్‌ ప్రభుత్వం అవి తమవి కాదని, వాటి నిర్వహణతో తమకు సంబంధంలేదని ఎప్పుడూ చెప్పలేదు. అది ఆ ప్రాంత సాంస్కృతిక, చారిత్రక వారసత్వం. ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశానికే సొంతం కాదు. అది ప్రపంచ వారసత్వం కూడా. దేశాల సరిహద్దులు మనం గీసుకున్నవి. అవి దీర్ఘకాలంలో స్థిరమైనవి కావు. అఫ్గానిస్థాన్‌లో బమియాన్‌ భారీ బుద్ధ విగ్రహాలను ఉగ్రవాదులు ఫిరంగులు పెట్టి పేల్చివేసినప్పుడు యావత్‌ ప్రపంచం విస్తుపోయింది. బమియన్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ఉంటే వివిధ దేశాల నుంచి సందర్శకులు వచ్చేవారు. ఏటా వారి సంఖ్య పెరిగేది. ఆదాయం లభించేది. తద్వారా అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి చెందేది. అక్కడి చరిత్ర ప్రపంచానికి తెలిసేది. అందుకు భిన్నమార్గంలో వెళ్లడం వల్ల చివరికి అఫ్గాన్‌ నష్టపోయింది.

భారత్​లో ఎన్నో ఆనవాళ్లు

భారత పర్యటక రంగం దేశ స్థూల ఉత్పత్తిలో పదిశాతం పైనే అదాయాన్ని సమకూరుస్తోంది. 12 శాతం ఉద్యోగాలనూ సృష్టించింది. అధిక శాతం పర్యటకులు బౌద్ధస్థలాలను, మొఘల్‌ వారసత్వ స్థలాలనే సందర్శిస్తున్నారు. కౌశాంబి, శ్రావస్తి, నలంద, గయ, సారనాథ్‌, కుసీనారా తదితర బౌద్ధక్షేత్రాలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపుపొందాయి. తాజ్‌మహల్‌, హుమాయూన్‌ సమాధి, దిల్లీ, ఆగ్రా ఎర్రకోటలు, ఫతేపూర్‌ సిక్రి... అదే స్థాయిలో ప్రాచుర్యం పొందాయి. వీటిని చూడటానికి నిత్యం పర్యటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. హైదరాబాదుకు చార్మినారు, ముంబయికి గేట్‌వే ఆఫ్‌ ఇండియా, కోల్‌కతాకు హౌరా వంతెన, దిల్లీకి ఎర్రకోట పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు 38 ఉన్నా, వాటిలోని మొదటి అయిదులో మొఘల్‌ చిహ్నాలే కావడం విశేషం.

పన్నుపోటుతో పాట్లు

పర్యటకరంగానికి ఉన్న ప్రతిబంధకాల్లో వస్తుసేవల పన్ను (జి.ఎస్‌.టి.) ఒకటి. ఇది పర్యటకరంగంపై 28 శాతంగా ఉంది. దీనికి అదనంగా హోటళ్లలో మరో అయిదు శాతం వడ్డిస్తున్నారు. మొత్తానికి 33 శాతం పన్ను పడుతోంది. ఫలితంగా ఇటీవలి కాలంలో పర్యటక ఆదాయం తగ్గిపోతోంది. ఇంత పన్ను కడుతున్నా ఆ మేరకు సేవలు అందడం లేదన్న పర్యాటకుల అభిప్రాయాన్ని తోసిపుచ్చలేం. ఏ దేశంలోనూ జీఎస్‌టీ ఇంత స్థాయిలో లేదు. థాయ్‌లాండ్‌, మలేసియాల్లో ఆరు, చైనాలో అయిదు, అత్యధికంగా ఇటలీలో పదిశాతం జీఎస్‌టీ ఉంది. అందువల్ల దేశీయంగా పన్ను శాతాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఆకట్టుకుంటున్న ఆలయాలు

తాజ్‌మహల్‌ కట్టడానికి ఆ రోజుల్లో (17వ శతాబ్దంలో) దాదాపు మూడుకోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చయింది. ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.300 కోట్లు కావచ్చు. తాజ్‌ పర్యాటకులు సంవత్సరానికి దాదాపు 70 లక్షల పైమాటే. రోజుకు 40,000 మందికి మించి తాజ్‌ ఆవరణలోకి అనుమతించరాదనే ఆలోచనలో పురాతత్వ శాఖ ఉంది. తాజ్‌మహల్‌ను విదేశీ పర్యటకులే దాదాపు ఎనిమిది లక్షలమంది సందర్శిస్తున్నారు. ఆగ్రాలో ఎర్రకోట, తాజ్‌మహల్‌లకు వీరు చెల్లించే ప్రవేశరుసుమే సంవత్సరానికి సుమారు రు.100 కోట్లు. 2017-18 సంవత్సరానికి వచ్చిన రూ.271 కోట్ల ఆదాయంలో రూ.146 కోట్లు తాజ్‌మహల్‌, ఆగ్రా ఢిల్లీ ఎర్రకోటలు, ఫతేపూర్‌ సిక్రి, కుతుబ్మీనార్‌ సందర్శకుల నుంచే వచ్చింది. వీటిలో కుతుబ్‌మీనార్‌ మాత్రమే ఢిల్లీ సుల్తానులు నిర్మించింది. మిగిలినవన్నీ మొఘల్‌ సామ్రాజ్య చిహ్నాలే. అజంతా, ఎల్లోరా, పూరీ, కోణార్క్, పట్టడకల్‌, హంపి, ఖజురహో, తమిళనాడులోని ఆలయాలు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఆగ్రా, దిల్లీలు ఆదాయంలో అగ్రస్థానాన ఉన్నాయి. ఈ కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యతని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.

దేశంలో వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధి లభించేది పర్యటక రంగంలోనే అన్నది కేంద్ర పర్యటక మంత్రి అల్ఫోన్స్‌ జోసెఫ్‌ కన్నంధానన్‌ అభిప్రాయం. దేశంలో దాదాపు ఎనిమిది కోట్ల ప్రజలు పర్యటకంపై ఆధారపడుతున్నారు. పన్నెండు శాతం పౌరులకు ఉపాధి కల్పిస్తున్న రంగమిది. గత సంవత్సరం రూ.1,77,000 కోట్ల విదేశ మారక ద్రవ్యం ఈ రంగం నుంచే లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన 38 స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వారసత్వ ప్రదేశాల్లో అత్యధికం బౌద్ధ, మొఘల్‌ వారసత్వానికి చెందినవే. వీటిని పరిరక్షించడంతోపాటు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. దీనితోపాటు చరిత్ర ఆధారంగా కొత్త కట్టడాలను గుర్తించడంతోపాటు వాటికి నూతన అందాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. తద్వారా సందర్శకులను ఆకట్టుకోవచ్చు. ప్రచారం ద్వారా విదేశీ యాత్రికులనూ ఆకర్షించవచ్చు. ఫలితంగా పర్యటక రంగం కళకళలాడటంతో పాటు ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి!

ఇదీ చూడండి: 'ఫరూక్​ను అరెస్టు చేయలేదు.. ఆయనే ఇంట్లో ఉన్నారు'

ABOUT THE AUTHOR

...view details