గల్లీకొక గాంధారి కొడుకు పుట్టుకొస్తున్న దుర్భర భారతమిది. హత్యకన్నా అత్యాచారమే దారుణ నేరమని ఆ మధ్య బాంబే హైకోర్టు ఆర్తిగా స్పందించింది. దేశంలో అటువంటి అకృత్యాలకిప్పుడు కొదవ లేదు. ఆడబిడ్డల మానాభిమానాలను చెరపట్టే కామాంధుల పీచమణుస్తామంటూ ప్రభుత్వాలెన్ని చట్టాలు వండివార్చినా, అభాగినుల శోకం ఆగని నదీప్రవాహమే అవుతోంది. అంతెందుకు- దేశాన్ని పట్టి కుదిపేసిన నిర్భయ ఉదంతం ఇంకా కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. అలాంటి బాగోతాలకు చెల్లు కొట్టేందుకంటూ సర్వోన్నత న్యాయస్థానం నూతన మార్గదర్శకాల్ని తెరపైకి తెచ్చింది. మీరే పరికించండి...
ఏడేళ్లైనా..
సుమారు ఏడేళ్ల క్రితం దిల్లీ మహాజనారణ్యంలో కదులుతున్న బస్సులోనే వైద్యవిద్యార్థినిపై సామూహిక దమనకాండ, ఆపై ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో యావద్దేశం అట్టుడికిపోయింది. వాడవాడలా పోటెత్తిన ప్రజల తీవ్ర నిరసన ప్రదర్శనలు పార్లమెంటులోనూ ప్రతిధ్వనించాయి. అమానుష హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకణ్ని బాలనేరస్థుడిగా గుర్తించి మూడేళ్లు సంస్కరణ గృహంలో ఉంచి వదిలేశారు. మిగతా నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. వాళ్ల అప్పీళ్లను సర్వోన్నత న్యాయస్థానం 2017లోనే కొట్టేసినా, శిక్ష అమలుపై నేటికీ పీటముళ్లు పడుతూనే ఉన్నాయి. అదీ ఎంతగా అంటే- సంచలనాత్మక హత్యాచార కేసులో దోషులు పదేపదే కోర్టుల్ని ఆశ్రయిస్తూ శిక్ష వాయిదాకు యత్నించడాన్ని ఆక్షేపిస్తూ, మరణశిక్షతో ముడివడిన వ్యాజ్యాల్లో హైకోర్టు తీర్పును సవాలు చేసే అప్పీళ్ల విచారణకు సుప్రీంకోర్టు ఆరు నెలల గరిష్ఠ పరిమితి విధించేటంతగా!
ఒకరు తర్వాత ఒకరు
నిర్భయ కేసులో దోషులకు జనవరి ఏడోతేదీన దిల్లీ న్యాయస్థానం మరణశాసనం జారీ చేసింది. జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తిహార్ జైలులో నలుగురినీ ఉరి తీయాలన్న ముహూర్త నిర్ణయం ఉదార నిబంధనల గాలికి కొట్టుకుపోయింది. ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిననాడే, మరో దోషి ముకేశ్‌సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన సమర్పించాడు. అది తిరస్కరణకు గురయ్యాక ఫిబ్రవరి ఒకటో తేదీన నరరూప రాక్షసుల్ని ఉరి తీయాలంటూ జనవరి మూడోవారంలో మళ్లీ డెత్‌వారంట్లు జారీ అయ్యాయి. రాష్ట్రపతి తన క్షమాభిక్ష అర్జీ తిరస్కరించడాన్ని దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ సుప్రీంకోర్టులో సవాలు చేయడం అనంతర పరిణామం. ఉరికి కొత్త తేదీని నిర్ణయించవచ్చునని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించిన నాలుగు రోజుల తరవాతా ఎక్కడి గొంగడి అక్కడే ఉండటం విడ్డూరం. ఇటువంటప్పుడు ‘సుప్రీం’ సరికొత్త మార్గదర్శకాలకు మాత్రం దక్కే మన్నన ఏపాటి అన్న మౌలిక ప్రశ్నకు, సమాధానం లేదు!
జాప్యంతో బాధిత కుటుంబ ఆక్రోశం!
లైంగిక దాడులకు, నేరాలకు పాల్పడిన ముష్కరులపై రెండు నెలల్లోపే అభియోగ పత్రాలు దాఖలు కావాలని గతంలో సుప్రీంకోర్టు గిరిగీసినా జరుగుతున్నదేమిటి? అత్యంత అరుదైన సందర్భాల్లోనే మరణదండన విధిస్తారని న్యాయపాలిక పదేపదే చాటినా- అమలులో తీవ్ర జాప్యం ఆనవాయితీగా స్థిరపడింది. నిర్భయ కేసుకు సంబంధించి 2013 జనవరిలో ఏర్పాటైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆ ఏడాది సెప్టెంబరులో దోషులకు ఉరిశిక్ష విధించింది. 2014 మార్చి నెలలో మరణ దండనను దిల్లీ హైకోర్టు ఖరారు చేసింది. నలుగురు దోషులూ సుప్రీంకోర్టును ఆశ్రయించాకనైనా, విచారణ ప్రక్రియ వేగం పుంజుకొని కథ ఓ కొలిక్కి వచ్చిందా? లేదు! కేసు విచారణ నిమిత్తం అక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. చివరకు 2017లో ఉరే ఖరారని సుప్రీంకోర్టు సైతం నిర్ధారించినా, మూడేళ్ల తరవాతా- బాధిత కుటుంబ ఆక్రోశానిది అంతులేని కథగానే మిగిలింది!