లింగమార్పిడి గురించి బహిరంగంగా మాట్లాడే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. తమ శరీరం నచ్చని ఏ అమ్మాయైనా, అబ్బాయైనా.. లింగమార్పిడి చేయించుకునే అవకాశాలూ ఇప్పుడు విరివిగానే ఉన్నాయి. కానీ ఒకప్పుడు దానిగురించి నోరు తెరిచి మాట్లాడటమే పెద్ద తప్పులా భావించేవారు. లింగమార్పిడి చేయించుకున్న వారికి సమాజంలో గౌరవం దక్కకపోవడమే కాకుండా.. శస్త్రచికిత్స తర్వాత మానసిక, శారీరక హింసకు గురయ్యేవారు. కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. దీన్ని ప్రస్తుతం నిషేధిత చర్యగానూ ప్రజలు చూడట్లేదు.
అనంద జీవనం వచ్చిందిలా..
లింగమార్పిడిని శాస్త్రీయ భాషలో జెండర్ డిస్ఫోరియా అంటారు. ఈ పదం ఇటీవల జోధ్‌పుర్‌లో చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ నృత్యకారుడు దీపక్.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుని, దీపికగా మార్పుచెందాడు. 3 నెలల క్రితం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది దీపిక. శస్త్రచికిత్స అనంతరం కొత్త దేహంతో చాలా ఆనందంగా జీవనం సాగిస్తోంది. చిన్నప్పటి నుంచీ ఆడపిల్లల దుస్తులు ధరించి, డ్యాన్స్ చేసేవాడినని చెప్తున్నాడు దీపక్. అమ్మాయిలతోనే సరదాగా గడిపేందుకు ఇష్టపడే దీపక్.. అబ్బాయిల సహవాసంలో తెగ ఇబ్బంది ఎదుర్కొనేవాడట.
బాలీవుడ్ డ్యాన్సర్ కావాలని..
"చిన్నప్పుడు అమ్మాయిల బట్టలు వేసుకుని డాన్స్ చేసేదాన్ని. నేను అమ్మాయినే అన్న భావన ఉండేది నాలో. డాన్సర్ అవ్వాలని నా కోరిక."
- దీపిక, మార్వాడీ డాన్సర్
పదేళ్లుగా జోధ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో మార్వాడీ పాటలకు నాట్యం చేస్తోంది దీపిక. డాన్స్ రంగంలో బాలీవుడ్లో రాణించాలని కలలు కంటోంది.
డాన్స్‌పై అభిరుచి పెరిగందలా..
"ముందు నాపేరు దీపక్‌గా ఉండేది. ఆ పేరుతోనే జోధ్‌పుర్‌లో నేను అందరికీ పరిచయం. ఇప్పుడు డాన్సర్ దీపిక పేరుతో గుర్తింపు పొందాలనుకుంటున్నాను. దేవుడి దయతో బాలీవుడ్‌లోకి వెళ్లాలనుంది. అందుకోసం బాగా కష్టపడుతున్నాను."
- దీపిక