రైతులను భాజపా విస్మరించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు అమిత్ షా తిప్పికొట్టారు. భాజపా పథకాల వల్ల 15కోట్ల రైతులు లబ్ధిపొందుతున్నారని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే రాహుల్ రెండో స్థానం చూసుకున్నారని ఈనాడు ముఖాముఖిలో విమర్శించారు షా.
15 కోట్ల రైతులకు లబ్ధి...
భాజపా రైతుల రుణాలు మాఫీ చేయదన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం రూ. 1.2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టేవాళ్లు. మేము ఆ మొత్తాన్ని రూ. 2 లక్షల కోట్లకు పెంచాం. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. దీనివల్ల 15 కోట్లమంది రైతులు లబ్ధిపొందుతారు.
వారు చేయలేనిది మేము చేశాం...
జవహర్లాల్ నెహ్రూ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అదే నినాదంతో గెలిచినవారే. వీరెవరూ పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు. కనీస ఆదాయ పథకమంటూ ఇప్పుడు రాహుల్ అదే పనిచేస్తున్నారు. కానీ మేము పేదరిక నిర్మూలనకు ఎన్నో చర్యలు చేపట్టాం. ఐదు దశాబ్దాల్లో వారు పరిష్కరించనిది మేము ఐదేళ్లలో చేసి చూపించాం.