రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం చెన్నై రానున్నారు. దిల్లీ నుంచి ఉదయం 10.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో రాజాఅణ్ణామలైపురంలోని లీలాప్యాలెస్‌కు వెళ్తారు. దారిపొడవునా ఆయనకు స్వాగతం పలికేందుకు భాజపా వర్గాలు ఏర్పాట్లు చేశాయి. అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపుపై అమిత్‌షా చర్చించనున్నారని సమాచారం. లీలాప్యాలెస్ నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి కలైవానర్ అరంగానికి వచ్చి, అక్కడ సమావేశంలో పాల్గొంటారు. తిరువళ్లూర్ జిల్లా తేరువాయి కండ్రిగలో రూ.380 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ.61,843 కోట్లతో చేపట్టే చెన్నై మెట్రోరైలు రెండో దశ పనులకు అమిత్‌షా చేతులమీదుగా శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా పాల్గొననున్నారు.
అమిత్‌షా ప్రారంభించనున్న తెరువాయి కండ్రిగ రిజర్వాయరు భాజపా నాయకులతో చర్చ
కార్యక్రమం అనంతరం సాయంత్రం 6.30కి తిరిగి అమిత్‌షా లీలా ప్యాలెస్‌కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు భాజపా రాష్ట్ర, జిల్లా నిర్వాహకులు, ప్రముఖ నాయకులు, వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరపనున్నారు. రాత్రి 8.30కి భాజపా ఉన్నత స్థాయి కమిటీతో చర్చించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాత్రికి లీలాప్యాలెస్‌లో బస చేయనున్న అమిత్‌షా ఆదివారం ఉదయం 10 గంటలకు కారులో బయలు దేరి విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.15కు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కలైవానర్ అరంగం వద్ద స్వాగత ద్వారాల ఏర్పాటు రజనీకాంత్‌తో భేటీ!
అమిత్‌షా పర్యటనలో భాగంగా రజనీ మక్కల్ మండ్రం అధ్యక్షుడు రజనీకాంత్, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అణ్ణాడీఎంకే కూటమిలోని భాజపా రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న పదుల సంఖ్యలో సీట్లు కోరి, సాధ్యమైనన్ని చోట్ల విజయం సాధించి తన బలాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా పలువుర్ని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది. తాజాగా కాంగ్రెస్ నుంచి నటి ఖుష్బూను కూడా పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా రజనీకాంత్‌ను బరిలో దింపాలని యత్నిస్తోంది. డీఎంకేను ఓడించాలంటే రజనీకాంతే ప్రధాన అస్త్రమని ఆ పార్టీ భావిస్తోంది. ఎంకే అళగిరి కూడా డీఎంకేపై గతంలో ఆరోపణలు చేసినా... కొన్ని నెలలుగా మౌనం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ మాట్లాడుతూ... అళగిరి పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో అమిత్‌షాను అళగిరి కలుస్తారని తెలుస్తోంది. శుక్రవారం మదురై నుంచి అళగిరి కారులో చెన్నై బయలు దేరినట్లు సమాచారం.
భాజపా శ్రేణులకు ప్రోత్సాహం: రాష్ట్ర అధ్యక్షుడు
అమిత్ షా రాష్ట్ర పర్యటన భాజపా శ్రేణులకు ప్రోత్సాహం ఇస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ తెలిపారు. శుక్రవారం ఈరోడ్ జిల్లా చెన్నిమలై మురుగన్ ఆలయానికి వేల్ యాత్రలో భాగంగా వచ్చిన ఎల్ మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దేవుడిని అవమానించిన డీఎంకే, కరుప్పర్ కూట్టంకు తగిన పాఠం చెప్పడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి, కరోనా కాలంలో పోరాడినవారిని గౌరవించడానికి చేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మురుగన్ సహా వేయి మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కలైవానర్ అరంగం వద్ద స్వాగత ద్వారాల ఏర్పాటు కలైవానర్ అరంగం వద్ద ఏర్పాటు కలైవానర్ అరంగం వద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది ఇదీ చూడండి:ఆదాయం రూ.1000.. కరెంటు బిల్లు 29 వేలు!