మహారాష్ట్ర ధూలే జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. శిర్పూర్ తాలూకాలోని వాఘాడి గ్రామంలో ఉన్న పరిశ్రమలో.. ఈ ఉదయం సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి 15 మంది మరణించారు. 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ధూలే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పేలుడుకు కారణాలు:
ప్రమాదం జరిగిన 'రుమిత్ చెమ్సింత్ ప్రైవేట్ లిమిటెడ్' ఫ్యాక్టరీలో ఔషధాలకు సంబంధించిన రసాయనాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లను, రసాయనాలతో నిండిన బారెల్స్ను ఉపయోగించడం వల్ల పేలుడు తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో విస్ఫోటం సంభవించింది. ప్రమాద సమయంలో సుమారు 100 మంది అక్కడ పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా చర్యలు చేపట్టాయి.