జమ్ముకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణలు 370, 35-A రద్దుతో పాటు జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, రాష్ట్రంలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. నేడు ఈ అంశాలపై లోక్‌సభలో చర్చ జరగనుంది. పూర్తిస్థాయి సంఖ్యాబలం లేని ఎగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు.. దిగువసభ గడపదాటడం లాంఛనమే కానుంది.
జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారమే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే.. ప్రస్తుతానికి బిల్లును ప్రవేశపెడుతున్నామని.. మంగళవారమే సభ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు షా. సమాధానం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ఈ పక్షంలో నేడు దిగువసభలో సుదీర్ఘ చర్చ సాగనుంది. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున అక్కడ బిల్లు సులువుగానే ఆమోదం పొందనుంది.
ఇదీ చూడండి:కశ్మీర్ 'హోదా రద్దు, విభజన'కు రాజ్యసభ ఆమోదం
సుదీర్ఘ చర్చ...
సోమవారం.. రాజ్యసభలో ఈ జమ్ముకశ్మీర్ అంశానికి సంబంధించిన సంక్లిష్ట తీర్మానాలు, బిల్లులపై ఏడున్నర గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం ఆమోదం లభించింది.
రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో... జమ్ముకశ్మీర్‌కు ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్ర చట్టాలు వర్తిస్తాయి. బిల్లులకు పార్లమెంటు ఆమోదం అనంతరం.. రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చనున్నాయి. అనంతరం.. జమ్మూ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారనుంది. శాంతిభద్రతలు పూర్తిగా కేంద్రం పరిధిలోకి రానున్నాయి.
తర్వాత ఏంటీ..?
జమ్ముకశ్మీర్‌కు కీలకంగా ఉన్న అధికరణల రద్దు, విభజన బిల్లు ఆమోదం అనంతరం.. అందాల లోయలో ఏం జరగబోతుంది..? అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 370 అధికరణం ఆధారంగా కొనసాగుతున్న ఆర్టికల్ 35-A కూడా ఉనికిని కోల్పోయిన కారణంగా.. ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌ని మార్చుతున్నప్పటికీ శాసనసభ అధికారాలు మాత్రం పరిమితంగానే ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యానే యూటీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్‌షా తెలిపారు. అంటే దిల్లీ మాదిరిగానే అధికారాలు కశ్మీర్‌కూ ఉండే అవకాశముంది.
అధికరణల రద్దుతో కశ్మీరీ వాసులకు అధికారాల పరంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కారణం.. దాదాపు భారత రాజ్యాంగంలోని కీలక అంశాలన్నీ జమ్ముకశ్మీర్‌కు క్రమక్రమంగా వర్తింపజేశారు. 1954 నాటి రాజ్యాంగ ఉత్తర్వు మొదలు ఇప్పటివరకూ కశ్మీర్‌లో అమలు కాని కీలక చట్టాలు పెద్దగా లేవు. ఎన్నికల నిర్వహణ కూడా భారత ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంది. సుప్రీంకోర్టు అధికారాలను సైతం వర్తింపజేశారు. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన కారణంతో.. కశ్మీర్‌లో ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పలేం.
ఇదీ చూడండి:370 రద్దుపై శివసేన, ఆర్ఎస్ఎస్ హర్షం
రాజకీయ ఉద్వేగమే ప్రధానం...
ఇతర ప్రయోజనాల కంటే అధికరణం-370 చుట్టూ అల్లుకున్న రాజకీయ ఉద్వేగం అన్నింటికంటే కీలకం. అధికరణను రద్దుచేసినా స్వయం ప్రతిపత్తి అలాగే కొనసాగిస్తే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే... ప్రతిపత్తి కొనసాగింపుతో మున్ముందు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధం జరిగే ప్రమాదం ఉండొచ్చని కేంద్రం భావించి ఉండవచ్చు. తీవ్రవాదుల దుశ్చర్యలతో సైన్యం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం, పన్నురూపంలో తాము చెల్లించిన వేలకోట్ల రూపాయలను కశ్మీర్‌లోనే ఖర్చుపెట్టాల్సి రావడం దేశ ప్రజల్లో కశ్మీర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే భావనకు కారణమయ్యాయి.
ఎప్పటినుంచో...
370 అధికరణం రద్దుకోసం జన్‌సంఘ్ రోజుల నుంచి భాజపా నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ని మూడు భాగాలుగా విడగొట్టాలన్న వాదనా గతంలో వినిపించింది. అయితే కశ్మీర్‌కు రాష్ట్ర స్థాయిని తీసేయాలన్న వాదన మాత్రం జన్‌సంఘ్ నేతల నుంచి కూడా రాలేదు. కనీసం ప్రధాన రాజకీయ పార్టీల మధ్యా చర్చకు రాలేదు. అనూహ్యంగా.. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.