భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కశ్మీర్లో భారత బలగాలు ఉన్నప్పుడు అకాలంగా కాల్పులు విరమించాలని నెహ్రూ ఆదేశాలివ్వకపోతే... పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉండేదే కాదన్నారు షా. నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నేటికీ ఆ సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.
అక్టోబర్‌లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి.
" 1947 అక్టోబర్ 26న మహారాజా హరీష్ సింగ్ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు అంగీకరించారు. అక్టోబర్ 27న భారత బలగాలు కశ్మీర్‌కు వెళ్లాయి. సైన్యం పాక్ వైపు వెళుతూనే ఉంది. పాకిస్థాన్ దళాలను తరిమి కొడుతూ మన బలగాలు చొచ్చుకెళ్లాయి. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యుద్ధానికి విరామం ప్రకటించారు. ఆ సమయంలో యుద్ధ విరామం ప్రకటించకుంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఉండేదే కాదు. యుద్ధాన్ని నిలిపేయటం వల్ల పీఓకే ఏర్పడింది. నెహ్రూ తప్పుడు నిర్ణయంతో పీఓకేగా మారింది."