కశ్మీర్ రాష్ట్రపతి పాలనపై లోక్సభలో బిల్లు జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగించేందుకు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు అమిత్ షా. కశ్మీర్‌లో 6 నెలలపాటు రాష్ట్రపతి పాలన పొడిగించాల్సిన అవసరముందని సభకు తెలిపారు. అమర్నాథ్ యాత్రతో పాటు ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం కచ్చితంగా తీసుకోవాలన్నారు కేంద్ర హోంమంత్రి. సభ్యులందరూ తీర్మానానికి మద్దతివ్వాలని కోరారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సభలో షా ప్రవేశపెట్టిన మొదటి ప్రతిపాదన ఇదే కావడం విశేషం.
సభ ముందుకు రిజర్వేషన్ బిల్లు
జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంత ప్రజలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లునూ సభలో ప్రవేశపెట్టారు అమిత్ షా. రిజర్వేషన్ల బిల్లు ఎవరినీ బుజ్జగించడానికి కాదని...ఆ రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల సంక్షేమం కోసమే అని వెల్లడించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని మూలాలతో సహా పెకిలించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు షా స్పష్టం చేశారు. ఆరు నెలల్లో జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కశ్మీర్ అభివృద్ధికి భారీగా నిధులు అందజేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.