తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2019, 4:38 PM IST

ETV Bharat / bharat

భారత్​ భేరి: సమరానికి సర్వం సిద్ధం

20 రాష్ట్రాలు... 91 స్థానాలు... 1280 మంది అభ్యర్థులు... సార్వత్రిక ఎన్నికల తొలిదశ సమరం స్వరూపమిది. గురువారం తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనుంది ఓటరుగణం. మిగిలిన 6 దశల పోలింగ్​ ముగిశాక... మే 23న ఫలితం వెలువడనుంది.

భారత్​ భేరి: సమరానికి సర్వం సిద్ధం

భారత్​ భేరి: సమరానికి సర్వం సిద్ధం

సార్వత్రిక సమరం మొదటి విడతకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లతో సమాయత్తమైంది. మొత్తం ఏడు విడతల్లో 543 స్థానాలకు ఎన్నికల జరగనుండగా... గురువారం మొదటి విడతలో 91 నియోజకవర్గాలకు ఓటింగ్​. ఆయా స్థానాల నుంచి పోటీ చేస్తున్న 12 వందల 80 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోట్లాది మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

20 రాష్ట్రాల్లో ఏప్రిల్​ 11న ఓటింగ్​ జరగనున్న స్థానాలు దాదాపు 17 శాతం లోక్​సభ సీట్లతో సమానం. ఈ సీట్లన్నీ కలిపితే ప్రతిపక్ష హోదా స్థానం పొందవచ్చు.

ఒకే విడతలో పూర్తి...

7 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. దక్షిణాదిన కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 42 సీట్లపై ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

ఈశాన్యాన ఉన్న 8 రాష్ట్రాల్లో మొత్తం 5 రాష్ట్రాల్లో పోలింగ్​ ఈ విడతలోనే పూర్తి కానుంది. అరుణాచల్​ ప్రదేశ్​లో 2 స్థానాలు, మిజోరాంలో ఒక స్థానం, మేఘాలయలో 2 స్థానాలు, నాగాలాండ్​లో 1 స్థానం, సిక్కింలో 1 స్థానాలు ఉన్నాయి.

ఉత్తరాదిన ఒక రాష్ట్రంలోనే(ఉత్తరాఖండ్​) మొదటి విడతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.

రాష్ట్రం తొలి విడత/ మొత్తం సీట్లు
ఆంధ్రప్రదేశ్ 25/25
అరుణాచల్​ప్రదేశ్​ 2/2
అసోం 5/14
అండమాన్​ నికోబార్​ 1/1
బిహార్​ 4/40
ఛత్తీస్​గఢ్ 1/11
జమ్ముకశ్మీర్ 2/6
మహారాష్ట్ర 7/48
లక్షద్వీప్ 1/1
మిజోరం 1/1
మణిపూర్​ 1/2
మేఘాలయ 2/2
నాగాలాండ్ 1/1
ఒడిశా 4/21
సిక్కిం 1/1
తెలంగాణ 17/17
త్రిపుర 1/2
ఉత్తరప్రదేశ్ 8/80
ఉత్తరాఖండ్ 5/5
బంగాల్ 2/42

హోరాహోరీ....

సార్వత్రిక ఎన్నికలు భాజపా, కాంగ్రెస్​కు ఎంతో ప్రతిష్టాత్మకం. విజయమే లక్ష్యంగా పదునైన వ్యూహాలు, ప్రజాకర్షక హామీలతో బరిలోకి దిగాయి రెండు పార్టీలు. తొలి దశ పోలింగ్​ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారంతో హోరెత్తించాయి.

విజయ సంకల్పంతో భాజపా...

అభివృద్ధే ప్రధానాంశంగా ఎన్నికల బరిలోకి దిగింది భాజపా. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ సుడిగాలి పర్యటనలతో సాధ్యమైనన్ని నియోజకవర్గాలు చుట్టేశారు.

రామ మందిర నిర్మాణం, జాతీయవాదం, సంక్షేమమే ప్రధానాంశాలుగా ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది భాజపా.

న్యాయ్​తో కాంగ్రెస్​ ...

2014 సార్వత్రిక ఎన్నికల నుంచి వరుస పరాజయాలు చవిచూసింది కాంగ్రెస్. ఇప్పుడు పునర్​ వైభవమే లక్ష్యంగా పోటీకి దిగింది. పేదలకు ఏటా రూ.72వేల సాయం వంటి ప్రజాకర్షక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

మహాకూటమి...

మోదీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటైంది మహాకూటమి. అయితే... రాష్ట్ర స్థాయిల్లో పొత్తులు కుదుర్చుకోవడంలో ఇబ్బంది పడింది. ఇప్పుడు విడివిడిగా పోటీచేసినా... ఫలితం అనంతరం పొత్తులతో కలిసి పనిచేస్తామంటున్నాయి కూటమి పార్టీలు.

ఇలా ఒక్కో పార్టీ ఒక్కో లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగింది. ఎవరి ఆశ నెరవేరుతుందో మే 23న తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details