తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: అందరి చూపు ఆ స్థానాలపైనే

ఉత్తర్​ప్రదేశ్​లో లోక్​సభ స్థానాలు ఎక్కువ. అందుకే దేశం దృష్టి ఆ రాష్ట్రంపై ఎప్పుడూ ఉంటుంది. యూపీలో మరో ఆసక్తికర అంశమూ ఉంది. జాతీయ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న స్థానాలు ఎక్కువున్నది ఈ రాష్ట్రంలోనే. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్​ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు ఆ రాష్ట్రం నుంచి పోటీకి దిగుతున్నారు.

భారత్​ భేరి: అందరి చూపు ఆ స్థానాలపైనే

By

Published : Mar 28, 2019, 6:17 AM IST

Updated : Mar 28, 2019, 9:23 AM IST

భారత్​ భేరి: అందరి చూపు ఆ స్థానాలపైనే

"నా అంతట నేను ఇక్కడికి రాలేదు. గంగామాత నన్ను పిలిచింది."
-నరేంద్ర మోదీ

2014 సార్వత్రిక సమరం సమయంలో భాజపా ప్రధాని అభ్యర్థి హోదాలో మోదీ వ్యాఖ్యలివి. లోక్​సభ ఎన్నికల్లో పోటీకి వారణాసిని ఎంచుకోవడానికి కారణమంటూ నరేంద్రుడు చెప్పిన ఈ మాటలు... అక్కడి ప్రజల హృదయాల్ని తాకాయి. భాజపాకు ఓట్ల వర్షం కురిపించాయి.

ప్రధాని అయ్యాక... వారణాసికి ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు మోదీ. ఇప్పుడు మరోమారు ఎన్నికలు వచ్చాయి. మళ్లీ తనను ఎందుకు ఎన్నుకోవాలో ప్రజలకు చెప్పాల్సిన సమయమిది.

"కాశీ నగరం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఆ విశ్వనాథుడే నన్ను ఇక్కడకు రప్పించాడు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మార్చి 8న వారణాసి పర్యటన సందర్భంగా మోదీ మాటలు ఇవి.

నియోజకవర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇలాంటి భావోద్వేగ అంశాలు మాట్లాడడం సహజమే. కానీ... గంగమ్మను, కాశీ విశ్వనాథుడ్ని ప్రస్తావిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు మాత్రం జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాయి.
అందరూ అక్కడి నుంచే...

వారణాసి తరహాలో దేశం దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాలు ఉత్తర్​ప్రదేశ్​లో మరికొన్ని ఉన్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు పోటీ చేయడమే వాటి ప్రత్యేకత.

"80 నియోజకవర్గాలున్న యూపీ నిర్ణయాత్మక రాష్ట్రం. అక్కడ వచ్చే ఫలితాలు జాతీయ రాజకీయాలను నిర్దేశిస్తాయి. అందరి దృష్టి ఆ రాష్ట్రం మీదే. ముఖ్యంగా ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలపై. తర్వాతి ప్రధానిని యూపీ ఇస్తుందా లేదా అనే విషయం ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది."
-- జేపీ శుక్లా, సీనియర్​ పాత్రికేయుడు

ప్రజలకు దగ్గరవుతున్న స్మృతి

యూపీలో మరో కీలక నియోజకవర్గం అమేఠీ. 2004 నుంచి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

2014లో రాహుల్​పై స్మృతి ఇరానీ పోటీతో ఆ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు స్మృతి. తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.

రెండోసారి అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై పోటీకి దిగుతున్నారు స్మృతి ఇరానీ. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఎక్కువ సమయం అక్కడే ఉంటున్నారు. రాహుల్​కు గట్టి పోటీనిస్తాననే భావనను భాజపా శ్రేణుల్లో కల్పిస్తున్నారు.

రాయ్​బరేలీ లోక్​సభ స్థానంలో 1999 నుంచి ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ విజయం సాధిస్తున్నారు.

కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్​బబ్బర్​ ఫతేపూర్​ సిక్రీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సీటు కాంగ్రెస్​కు​ ఎంతో ప్రతిష్టాత్మకం.

ములాయం కుటుంబం నుంచి

ఉత్తర్​ప్రదేశ్​లోని కన్నౌజ్​ లోక్​సభ స్థానం బరిలో దిగుతున్నారు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ భార్య డింపుల్​. అజంగఢ్​ లోక్​సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు అఖిలేశ్​. 2014లో ఆ స్థానంలో ములాయం సింగ్​ యాదవ్​ గెలిచారు. ములాయం సింగ్​ యాదవ్​ ఈసారి మైన్​పురి బరిలో ఉండనున్నారు.

భాజపా నుంచి..

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మరోసారి లఖ్​నవూ నుంచి పోటీ చేయనున్నారు. అక్కడ భాజపా బలంగా ఉంది. బాలీవుడ్​ అగ్రనటి హేమమాలిని మథుర నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు.

భాజపా మరో ముఖ్య నేత వరుణ్​గాంధీ సుల్తాన్​పూర్​ స్థానాన్ని వదిలి, ఆయన తల్లి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న పీలీబీత్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఉపఎన్నికల్లో ఓటమి

గోరఖ్​పూర్​, ఫుల్​పూర్​ లోక్​సభ ​స్థానాలను భాజపా తిరిగి సంపాదించుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం. ఆ స్థానాల నుంచి ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్ మౌర్య​ 2014లో గెలుపొందారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాక వారిద్దరి రాజీనామాతో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ఆ ఎన్నికల్లో భాజపాకు ఓటమి ఎదురైంది.

గోరఖ్​పూర్​, ఫుల్​పూర్​​లో కనిపించిన ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రభావం... ఈసారి యూపీ అంతా ఉండనుంది. 2014లో సాధించినన్ని స్థానాలు ఇప్పుడు గెలవడం భాజపాకు సవాలే. అప్పట్లో అప్నాదళ్​తో కలిసి 73 స్థానాలు సొంతం చేసుకుంది కమలదళం.

ప్రియాంకకు పరీక్ష

సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజకీయ అరంగేట్రం చేశారు ప్రియాంక గాంధీ. ఆమెపై కాంగ్రెస్​ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ప్రస్తుతం యూపీ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మోదీని తీవ్రంగా విమర్శిస్తూ... ప్రచారం సాగిస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ సాధించే ఫలితాలపైనే ప్రియాంక రాజకీయ భవిష్యత్​ ఆధారపడి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఇదీ చూడండి:భారత్​ భేరి: మహాకూటమికి ఏమైంది?

Last Updated : Mar 28, 2019, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details