అజిత్ డోభాల్కు కేంద్ర కేబినెట్ హోదా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్కు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు కేంద్ర కేబినెట్ హోదా ప్రకటించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా జాతీయ భద్రతా సలహాదారుగా మరో ఐదేళ్ల పాటు డోభాల్ను కొనసాగించనున్నారు. గత ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదాలో సేవలందించారు డోభాల్.
జాతీయ భద్రత అంశాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు డోభాల్.
2016లో పీఓకేలో భారత్ జరిపిన లక్షిత దాడులు, 2019లో బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. డోక్లాం విషయంలో చైనాతో పరిస్థితులను చక్కబెట్టింది కూడా డోభాలే. 1999లో కాందహార్ హైజాక్ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపిన బృందంలోనూ ఆయన కీలక వ్యక్తి.
ఉత్తరాఖండ్ (ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్)లో 1945లో జన్మించారు డోభాల్. 1968 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా కెరీర్ను ప్రారంభించారు. 2005లో ఐబీ డైరెక్టర్గా పదవీ విరమణ పొందారు. 2014లో మోదీ ప్రభుత్వంలో ఐదో జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు డోభాల్.
ఇదీ చూడండి: 13 మందితో భారత యుద్ధ విమానం గల్లంతు