తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాయు కాలుష్యంతో గతేడాది 16.7 లక్షల మరణాలు!

2019లో దేశంలో అత్యధిక వాయు కాలుష్యం నమోదైందని స్టేట్​ ఆఫ్​ గ్లోబల్​ ఎయిర్​ 2020 నివేదిక వెల్లడించింది. ఈ కారణంగా.. 16.7 లక్షల మంది చనిపోయారని స్పష్టం చేసింది. ఇందులో లక్షమందికిపైగా పసికందులేనని పేర్కొంది. అత్యధిక జనాభా గల 20 దేశాల్లో 14 దేశాలు గాలి నాణ్యతను మెరుగుపరచుకున్నాయి. భారత్​, బంగ్లాదేశ్​, నైగర్​, పాకిస్థాన్​, నేపాల్​, జపాన్​ మాత్రం అత్యధిక కాలుష్యాన్ని నమోదు చేశాయి.

Air pollution biggest health risk in India, contributed to death of 16.7 lakh people in 2019: Study
వాయు కాలుష్యంతో గతేడాది 16.7 లక్షల మరణాలు!

By

Published : Oct 22, 2020, 9:50 AM IST

దేశంలో గత ఏడాది అత్యధిక వాయు కాలుష్యం నమోదైంది. బుధవారం విడుదలైన 'స్టేట్​ ఆఫ్​ గ్లోబల్​ ఎయిర్​ 2020'(ఎస్​ఓజీఏ 2020) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల 2019లో చనిపోయినవారు 16.7 లక్షల మంది కాగా వారిలో 1.16 లక్షల మంది పసికందులే. పుట్టిన నెలరోజుల్లోపే వారు కన్నుమూశారు. ఇంటా బయటా ముప్పిరిగొన్న సూక్ష్మస్థాయి ధూళి.. వారి ఆయువు తోడేసింది. సగానికి సగం మరణాలకు అతి సూక్ష్మస్థాయి ధూళి కణాలు(పీఎం 2.5) కారణం కాగా కర్రబొగ్గు, కలప, పిడకలు వంటివి వంట కోసం వాడటం వల్ల వెలువడే కాలుష్యం.. మిగిలిన ప్రాణనష్టానికి కారణమవుతోంది. కాలుష్యం కారణంగా పక్షవాతం, గుండెపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివాటికి గురై లక్షల మంది చనిపోతున్నారని నివేదిక చెబుతోంది. నేపాల్​, నైగర్​, నైజీరియా, ఖతార్​లు కాలుష్యం విడుదల చేయడంలో భారత్​ సరసన ఉన్నాయి. అమెరికాకు చెందిన 'హెల్త్​ ఎఫెక్ట్స్​ ఇన్​స్టిట్యూట్​ అండ్​ గ్లోబల్​ బర్డెన్​ ఆఫ్​ డిసీజెస్​'(జీబీడీ) అనే సంస్థ క్షేత్రస్థాయి అంశాలతో పాటు, శాటిలైట్​ ఆధారంగా సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది.

నివేదిక ఏం చెప్పింది?

  • అత్యధిక జనాభా గల 20 దేశాల్లో 14 దేశాలు గాలి నాణ్యతను మెరుగుపరచుకున్నాయి. భారత్​, బంగ్లాదేశ్​, నైగర్​, పాకిస్థాన్​, నేపాల్​, జపాన్​ మాత్రం అత్యధిక కాలుష్యాన్ని నమోదు చేశాయి.
  • ప్రపంచంలో ప్రాణాంతకంగా మారి, ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అంశాల్లో వాయు కాలుష్యం నాలుగో స్థానాన్ని ఆక్రమించగా, భారత్​లో అకాల మరణాలకిది ప్రధాన కారణంగా ఉంది.
  • అత్యధిక ఓజోన్​ విడుదల చేసే దేశాల్లో ఖతార్​, నేపాల్​లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా భారత్​ మూడో స్థానాన్ని ఆక్రమించింది.
  • ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న ఓజోన్​ 2010లో 47.3 పీపీబీ ఉండగా, అది 2019 నాటికి 49.5 పీపీబీకి చేరింది.
  • వాయు కాలుష్య ప్రభావానికి గురయ్యే గృహాలు చైనాలో 54 శాతం నుంచి 36 శాతానికి తగ్గితే, భారత్​లో 73 శాతం నుంచి 61 శాతానికి తగ్గాయి.

ఆరోగ్యానికి ముప్పు

2.5 పీఎం ధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఒక్కోసారి రక్తంలో కలిసే ముప్పు ఉంటుంది. ఓజోన్​ వాయువు వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది గాలిలో నేరుగా ఉత్పత్తి కాదు. శిలాజ ఇంధనాలను మండించటం వల్ల, విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమల్లోని బాయిలర్లు తదితరాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. తక్కువ మోతాదులో ఓజోన్​ ఉన్నా కూడా దగ్గు, గొంతు మంట, ఊపిరాడకపోవటం, ఛాతీలో నొప్పి వంటివి సంభవిస్తాయి. నవజాత శిశువుల మరణాల్లో 21 శాతానికి కారణం వాయు కాలుష్యమే. దేశంలో 2010 నుంచి దాదాపు 5 కోట్ల మంది గృహ సంబంధ కాలుష్యానికి గురయ్యాయని అంచనా.

ABOUT THE AUTHOR

...view details